మహాకుంభ్‌నగర్: జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ(Maha Kumbh) మేళా జరగనున్నది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గంగా, యమునా, సరస్వతీ నదీ సంగమ ప్రదేశంలో జరిగే మహాకుంభ్‌కు లక్షల సంఖ్యలో జనం హాజరుకానున్నారు. పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తులకు భారీ ఏర్పాట్లు చేశారు. రోడ్లు వెడల్పు చేసి, ఘాట్లను సమం చేసి, నది వద్ద టెంట్లు ఏర్పాటు చేసే అంశంలో కార్మికులు ఓ సైన్యంలా పనిచేస్తున్నారు.
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ ప్రోగ్రామ్‌లో దీనిపై మాట్లాడారు. ఐకమత్యానికి మహాకుంభ్ అని మోదీ ఆ ఈవెంట్‌ను వర్ణించారు. మహాకుంభ్ నుంచి తిరిగి వెళ్తూ.. ద్వేష, విభజన భావాన్ని వీడాలని సందేశం ఇచ్చారు. మహాకుంభ్ కా సందేశ్.. ఏక్ హో పూరా దేశ్ అని మోదీ అన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభ్.. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన పౌశ పున్నమి రోజున ప్రారంభంకానున్నది. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో మహాకుంభ్ ముగుస్తుంది.
ఆ పవిత్ర సమయంలో నదీ స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ సంగమం వద్దకు చేరుకుంటారు. ఈ ఏడాది మహాకుంభ్ సమయంలో సుమారు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. సుమారు లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేసన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1250 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.
సులభ స్నానాల కోసం తొమ్మిది పేవ్మెంట్ ఘాట్లు, ఏడు రివర్ఫ్రెంట్ రోడ్డు, 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లను నిర్మిస్తున్నారు. ఏడు బస్టాండ్లను నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చేందుకు స్ట్రీట్ పెయింటింగ్స్ చేస్తున్నారు.
గత కొన్నేళ్ల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో నదీ పరివాహక ప్రాంతం తగ్గిపోయింది. సుమారు 3200 ఎకరాల నదీ స్థలం ఆక్రమణకు గురైంది. కానీ ఆ స్థలాన్ని తిరిగి చేజిక్కించుకున్న ప్రభుత్వం దాదాపు 4 వేల హెక్టార్లలో ఏర్పాట్లు చేస్తున్నది. ఆర్థిక లావాదేవీలు స్మూత్‌గా సాగేందుకు అనేక ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు.
హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని సెటప్ చేస్తున్నారు. రెండు 20 పడకల సబ్ సెంటర్ ఆస్పత్రులను, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 125 అంబులెన్సులు అందుబాటో ఉంటాయి. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. మతపరమైన అకాడాలకు కూడా ప్రత్యేక టెంట్లను కేటాయించారు.