న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్ (Ragging) చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పలువురు విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో వారి వీపు, కాళ్లు కమిలిపోయాయి. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం.. ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నది. వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా విద్యార్థుల పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించనున్నది. వారితో చర్చించిన అనంతరం నిందితులపై తదుపరి చర్యలకు తీసుకోనున్నది. కాగా, బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
15 మంది జూనియర్లను భౌతికంగా హింసించారని, నిందితులైన ఐదుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రాజివ్ రంజన్ తెలిపారు. ఇదే విషయమై పేరెంట్ టీచర్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై చర్చిస్తామని వెల్లడించారు. కాగా, ఈ స్కూల్లో 530 మంది విద్యార్థులు చదువుతుండగా, 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.