Shimla : పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఆధ్యాత్మిక యాత్రలకు కూడా కేంద్ర బిందువుగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా. ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఇటీవలి కాలంలో పర్యాటకులు పోటెత్తుతున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భారీగా టూరిస్టులు వస్తున్నారు. అందులోనూ వేసవిలో ఇక్కడ చల్లగా ఉండటంతో లక్షలాది మంది షిమ్లా, పరిసర ప్రాంతాల్ని సందర్శిస్తుంటారు. టూరిజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. ఇక్కడ ట్రాఫిక్ సమస్య భారీగాఈ వేధిస్తోంది. గడిచిన 45 రోజుల్లో ఈ ప్రాంతానికి 15 లక్షల వాహనాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గత మే 1 నుంచి జూన్ 15 వరకు భారీ సంఖ్యలో వాహనాలు పోటెత్తాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. దీన్ని అరికట్టేందుకు అదనంగా 210 మంది పోలీసులు, హోమ్ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. షిమ్లా పట్టణంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల రోడ్లు, ఇక్కడికొచ్చే హైవేల మీద కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. ఐదు అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. యాక్షన్ ప్లాన్ ప్రకారం.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి అక్కడ అదనపు సిబ్బందిని నియమిస్తారు. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు బైకులపై పని చేసే ప్రత్యేక టీములను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్ని వాడుతారు. సిటీని ఐదు సెక్టార్లుగా విభజించారు. సీనియర్ అధికారులు సెక్టార్ ప్రకారం ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారు. పర్యాటకులకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను సూచిస్తారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా వాడేలా చూస్తారు.
ట్రాఫిక్‌పై ప్రజలకు, పర్యాటకులకు అవగాహన కల్పిస్తారు. పార్కింగ్ జోన్లలో వాహనాలు ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు సులభమైన మార్గాల్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్లు కూడా ఈ సేవల్లో పాల్గొంటున్నారు. ఇక, భారీ వాహనాలైన బస్సులు, లారీలు వంటివి ఈ రోడ్లపై బ్రేక్ డౌన్ అయి నిలిచిపోవడం మరో సమస్యగా మారింది. అందుకే ప్రైవేటు వాహనాలు కొన్ని ప్రదేశాల్లోకి రాకుండా నిషేధం విధించారు. నిలిచిపోయిన వాహనాల్ని త్వరగా రోడ్ల మీద నుంచి తొలగించేందుకు చాలా చోట్ల ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు సత్ఫలితాల్నిస్తాయని అక్కడి ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు.