అగర్తల: విద్యార్థులు విహార యాత్రకు వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. (Bus Catches Fire) ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులకు కాలిన గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ త్రిపురలోని మోహన్పూర్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం స్కూల్ విద్యార్థులు బస్సులో పిక్నిక్కు వెళ్లారు. తిరిగి వస్తుండగా బస్సు లోపలు ఉంచిన జనరేటర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చెలరేగిన మంటలను ఆర్పివేశారు.
కాగా, ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులకు కాలిన గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. తొమ్మిది మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. స్వల్పంగా గాయపడిన నలుగురు విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తర్వాత వారి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.
మరోవైపు బస్సు లోపల ఉంచిన జనరేటర్ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, సీఎం మాణిక్ సాహా ఈ ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.