కోల్‌కతా : బీజేపీ పాలిత పశ్చిమబెంగాల్లో 12 ఏండ్ల బాలికపై ఘోరమైన ఘటన జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆమెను బతికుండగానే కుంటలో పడేయగా నీటిలో మునిగి చనిపోయింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలిక తన స్నేహితురాలికి బర్త్ డే గిఫ్ట్ కొనేందుకు బయటకొచ్చింది. ఆ టైమ్‌లో నలుగురు యువకులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆమె తలపై బండరాయితో కొట్టి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బతికుండగానే పక్కనే ఉన్న కుంటలో పడేయగా.. ఆమె నీటిలో మునిగి చనిపోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమె ఊపిరితిత్తులు, కడుపులో నీళ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. శరీరం నిండా కాట్లు, గీతలున్నాయని, మర్మాంగాలపై బలమైన గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద సర్దార్తో పాటు దిబాకర్ సర్దార్, ప్రభాస్ మండల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ ఫుటేజీలో నలుగురు బాలికను తీసుకెళ్తున్నట్టు ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా బాలిక హత్యాచారంపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తి ప్రమేయం ఉందనే అనుమానంతో అతనిపై ఓ గుంపు దాడి చేసి చంపేసింది. రోడ్లు, రైల్వే పట్టాలను బ్లాక్ చేశారు. నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.