బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 12 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని నర్సింగ్ కాలేజీలో శుక్రవారం ఇది వెలుగుచూసింది. మరసూర్‌లోని స్పూర్తి కాలేజీలో కరోనా సోకిన వారంతా బీఎస్సీ నర్సింగ్ మొదటి ఏడాది చదువుతున్న మహిళలు. వీరిలో 11 మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఒక యువతి కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఆమెకు జూన్‌లో కరోనా సోకడంతో ఇంకా టీకా తీసుకోలేదు.
కాగా కరోనా బారినపడిన 9 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని నర్సింగ్ కాలేజీ అధికారులు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కరోనా టెస్ట్ చేయగా 12 మందికి వైరస్ సోకినట్లుగా గుర్తించామన్నారు. ఈ విద్యార్థులను కలిసిన వారితోపాటు మిగతా విద్యార్థులకు కూడా కరోనా టెస్ట్‌లు చేస్తామని తెలిపారు.