ఇంఫాల్: మణిపూర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. (Manipur Encounter) కుకీ మిలిటెంట్లు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు కొందరు గాయపడ్డారు. అస్సాం సరిహద్దు సమీపంలోని జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అనుమానిత కుకీ మిలిటెంట్లు రెండు వైపుల నుంచి జిరిబామ్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని జకురాడోర్ కరోంగ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.
కాగా, భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్కు చెందిన కొందరు జవాన్లు కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న నిరాశ్రయుల శిబిరం కుకీ మిలిటెంట్ల లక్ష్యం కావచ్చని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి. జిరిబామ్ జిల్లాలోని ఈ పోలీస్ స్టేషన్‌ను కుకీ మిలిటెంట్లు పలుసార్లు టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు.