Amit shah | మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. ఆదివారం నవీ ముంబైలో అమిత్ షా ముఖ్య అతిథిగా మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవం జరిగింది. బీజేపీ-శివసేన (ఏక్నాథ్ వర్గం) ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను నిర్వహించారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డును (Maharashtra Bhushan award) ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన సామాజిక కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ సభకు వచ్చిన వారికోసం పెద్ద పెద్ద ఎల్ఈడీ స్రీన్లు, సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. నీడనిచ్చే వసతి మాత్రం కల్పించలేదు. అసలే ఎండా కాలం కావడంతో సూర్యుడు ప్రతాపం చూపించాడు. 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ్బతో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మరో 50 మందికి పైగా వడదెబ్బకు గురయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రకటించారు. ఎండవేడిమి తట్టుకోలేక మరణించారని తెలిపారు.
ప్రజలకు సిట్టింగ్ ఏర్పాట్లు చేసినప్పటికీ.. పైకప్పులేకపోవడంతో సభకు వచ్చిన ప్రజలు ఎండదెబ్బకు గురయ్యారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వచ్చే జనం కోసం కనీస వసతులు కల్పించకపోవడం ఏంటని అందరూ మండిపడుతున్నారు. బీజేపీ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్నవారిని సీఎం ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పరామర్శించారు. బాధితుల చికిత్సకు అవసరమైన ఖర్చులను భరిస్తుందని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.