ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి గోండియాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని దవాఖానకు తరలించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రధాని రూ.2 లక్షలు, సీఎం షిండే రూ.10 లక్షలు పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం షిండే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.