లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్‌లో దారుణం జరిగింది. తిట్టండన్న కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన విద్యార్థి ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. అయితే బుల్లెట్లు సున్నిత అవయవాలకు తగలకపోవడంతో టీచర్‌కు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన చికిత్స కోసం టీచర్‌ను లక్నో ఆస్పత్రికి పంపించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలో ఓ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి తోటి విద్యార్థితో గొడవపడ్డాడు. ఇది గమనించిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించి పంపాడు. దాంతో టీచర్‌పై కక్ష పెంచుకున్న ఒక విద్యార్థి నాటు తుపాకీతో టీచర్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
విద్యార్థి దొంగచాటుగా టీచర్‌ను వెంబడించి ఒక్కసారిగా కాల్పులకు దిగిన దృశ్యాలు ఫుటేజ్‌లో ఉన్నాయి. తుపాకీలో బుల్లెట్లు అయిపోయిన తర్వాత టీచర్ ప్రతిఘటించగా విద్యార్థి తుపాకీతో దాడిచేశాడు. స్థానికులు గమనించి విద్యార్థిని పట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.