న్యూఢిల్లీ, నవంబర్ 2: ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్, తన ఫీజు ఎంతన్న దానిపై మొదటిసారి పెదవి విప్పారు. ఒక పార్టీ లేదా ఒక రాజకీయ నేత కోసం ఒక్క ఎన్నికల్లో పనిచేస్తే..తన ఫీజు రూ.100 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుందని తాజాగా ప్రకటించారు. ‘జన్ సురాజ్’ పార్టీని స్థాపించిన ఆయన బీహార్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. శనివారం ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ ‘ఎన్నికల ప్రచారానికి నిధులు ఎలా వస్తాయని ప్రజలు తరుచూ నన్ను అడుగుతున్నారు. నేను అంత బలహీనుడిగా కనిపిస్తున్నానా? ప్రచారానికి అవసరమయ్యే టెంట్లు వేసుకునే డబ్బు నా వద్ద లేదని మీరు అనుకుంటున్నారా? ఒక్క ఎన్నికల్లో వ్యూహకర్తగా నా ఫీజు రూ.100 కోట్లు. అంతకన్నా ఎక్కువే ఉంటుంది. నా వ్యూహాల వల్ల 10 రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు.