Minister Parameshwara | బెంగళూరు/హుబ్బళ్లి, ఆగస్టు 30: వరుస కుంభకోణాల నేపథ్యంలో కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ప్రమోషన్‌గా సీఎం పదవి ఇస్తే తప్పక సంతోషిస్తానని పేర్కొన్నారు. బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎం కావాలనే కోరిక లేకపోవడానికి తానేమీ సన్యాసిని కాదు కదా! అని వ్యాఖ్యానించారు. పరమేశ్వరకు సీఎం పదవి వస్తే సంతోషిస్తానని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి స్పందిస్తూ ‘అదే జరిగితే నేను కూడా సంతోషిస్తాను’ అని పేర్కొన్నారు. ముడా స్కాం ఆరోపణలతో పీకల్లోతు ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను హస్తం పార్టీ సీఎం పదవి నుంచి తప్పిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పరమేశ్వర వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.
రాష్ట్రంలో ఒకవేళ సీఎంను మారిస్తే దళిత నేత, హోంమంత్రి పరమేశ్వర రేసులో ముందున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీఎం మార్పు తప్పదనుకొంటే, ఆ పదవిని దళిత నేతకు ఇవ్వాలని సిద్ధరామయ్య వర్గం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తర్వాత దళిత వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నేతగా పరమేశ్వర ఉన్నారు. కాగా, ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శనివారం నిర్వహించ తలబెట్టిన ‘చలో రాజ్‌భవన్’ ఆందోళన కార్యక్రమంపై పరమేశ్వర మాట్లాడుతూ గవర్నర్ అనుమతి చట్టవిరుద్ధమని అన్నారు. దీనిపై రాష్ట్ర క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకొన్నదని, దీనికి సంబంధించి అందించిన ఆధారాలను గవర్నర్ పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నదని సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే రవికుమార్ గౌడ తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. 2008, 2019లో కూడా ‘ఆపరేషన్ కమలం’ ద్వారానే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కూడా అదే కుట్రలు చేస్తున్నదని అన్నారు. 136 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంత సులభం కాదని, తమ ఎమ్మెల్యేల్లో ఎవరూ కూడా డబ్బులకు లొంగబోరని ఆశిస్తున్నానన్నారు. 16వ ఆర్థిక సంఘంపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ చైర్మన్ అరవింద్ పనగరియాను కలిశామని, తమ డిమాండ్లను ఆయన ముందుంచామని తెలిపారు. కాగా, హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌కు జైల్లో సకల సౌకర్యాలు కల్పించడంపై స్పందిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది జైలు సిబ్బందిని సస్పెండ్ చేశామని, దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చామని తెలిపారు. ఈ విషయంలో డీజీపీకి కూడా నోటీసులు జారీచేశామన్నారు.