న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ ప్రొసీడింగ్స్ ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఇష్టారీతిగా అజెండాను మార్చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియజేయడంతో సమావేశానికి హాజరైన 10 మంది ప్రతిపక్ష సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ప్రొసీడింగ్స్‌ని ఓ ప్రహసనంగా మార్చేసిన చైర్మన్ జగదంబికా పాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు జేపీసీ సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన చైర్మన్ సమావేశాన్ని అడ్డుకోవడానికే సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనవరి 21న జేపీసీ సమావేశం తర్వాత తదుపరి సమావేశం జనవరి 24-25న జరుగుతుందని చైర్మన్ తెలియచేశారని అంతకుముందు తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తెలిపారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారని, చైర్మన్ తమ మాటను వినకుండా శుక్రవారానికి సమావేశాన్ని ఖరారు చేశారని ఆయన తెలిపారు. శుక్రవారం సమావేశానికి చెందిన అజెండాను గురువారం రాత్రి మార్చి అర్ధరాత్రి తమకు సమాచారం అందచేశారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులను చైర్మన్ పని మనుషుల్లాగా చూస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారని బెనర్జీ ఆరోపించారు.
ఈనెల 27న జరగనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన జేపీసీ సమావేశాన్ని వాయిదావేయాలని, నిష్పాక్షికంగా, పారదర్శకంగా సమావేశాలను నిర్వహించేలా జేపీసీ చైర్మన్ జగదంబికాపాల్‌ను ఆదేశించాలని కోరుతూ కమిటీలోని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్‌కు శుక్రవారం లేఖ రాశారు.