లక్నో, నవంబర్ 16: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం సంభవించింది. ఓ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల వయసు కూడా నిండని 10 మంది చిన్నారుల నూరేండ్ల ఆయుష్షును మింగేసింది. సరిగ్గా కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే సజీవ దహనం చేసింది. ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాల దవాఖానలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో నవజాత శిశువులకు అత్యవసర చికిత్స అందించే నియోనాటల్ ఐసీయూ(ఎన్ఐసీయూ)లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది శిశువులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగినప్పుడు ఎన్ఐసీయూలో కనీసం 54 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. దవాఖాన సిబ్బంది, తల్లిదండ్రులు కిటికీలు, తలుపులు పగలగొట్టి కొందరిని రక్షించగలిగారు. కాగా, మరణించిన 10 మంది చిన్నారుల్లో ఏడుగురిని గుర్తించి, పోస్ట్‌మార్టం నిర్వహించారు. మరో ముగ్గురిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా గుర్తించినట్టు యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ చెప్పారు. కాగా, ఓ నర్సు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో పక్కనే ఓ నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతో మంటలు వ్యాపించాయని చెప్పాడు. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో దవాఖానలో ఉన్నవారు పరుగులు తీశారని, తొక్కిసలాట జరిగి అనేకమంది గాయపడ్డారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై మూడంచెల విచారణకు యూపీ ప్రభుత్వం ఆదేశించింది. పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖతో పాటు మెజిస్టేరియల్ విచారణ జరిపిస్తున్నది.
దవాఖానలో అగ్నిమాపక పరికరాలు సరిగ్గా పని చేయడం లేదని, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్ అలారంలు మోగలేదని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మంటలు ఆర్పడంలో ఆలస్యం జరిగిందని, ప్రాణనష్టం పెరిగిందని వెల్లడించాయి. ఘటన జరిగిన వార్డులో 2020లోనే గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు లభించాయి. అయితే, అగ్నిమాపక పరికరాలు పని చేస్తున్నాయని, ఫిబ్రవరిలోనే దవాఖానలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందని, జూన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు బ్రజేశ్ పాఠక్ తెలిపారు.
దవాఖాన ముందు శనివారం చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దవాఖానలో తమ పిల్లలు చికిత్స పొందుతున్నారని, వారిని చూసేందుకు తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. తమ పిల్లలు ఎలా ఉన్నారో తమకు చూపించాలని డిమాండ్ చేశారు. కాగా, అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించిన చిన్నారులను దవాఖానలోని మరో యూనిట్‌కు వైద్యులు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఘటనాస్థలిని పరిశీలించేందుకు దవాఖానకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్‌కు స్వాగత ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమైంది. డిప్యూటీ సీఎం రాకకు ముందు దవాఖాన ప్రాంగణంలో రోడ్డుకు ఇరువైపులా సిబ్బంది ముగ్గుపోశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో రాజకీయ పార్టీలు, నెటిజన్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఓ వైపు చిన్నారులు కాలిపోయి మరణిస్తే.. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ కఠినత్వాన్ని చాటుతున్నదని’ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.