రాంచీ: సంబల్పూర్-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు చెలరేగిపోయారు. స్లీపర్ కోచ్‌లోని ప్రయాణికులను గన్స్‌తో బెదిరించారు. కొందరిపై దాడి చేశారు. నగలు, నగదు, మొబైల్ ఫోన్లు దోపిడీ చేసి చైన్ లాగి పారిపోయారు. (Robbers Loot Train Passengers) జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి 11.22 గంటలకు జార్ఖండ్‌లోని లతేహర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది.
కాగా, సాయుధులైన పది మందికిపైగా వ్యక్తులు ఎస్ 9 కోచ్‌లోకి ఎక్కారు. స్టేషన్ నుంచి రైలు బయలు దేరిన తర్వాత ఆ దొంగలు చెలరేగిపోయారు. తమ వద్ద ఉన్న గన్స్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ స్లీపర్ కోచ్‌లోని ప్రయాణికులను భయాందోళనకు గురి చేశారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన కొందరిని కొట్టారు. పలువురి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. ఆ తర్వాత చైన్ లాగి రైలు నుంచి దిగి పారిపోయారు.
Passengers Treatment
మరోవైపు, లతేహర్, బర్వాడీ స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగినట్లు తూర్పు మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దోపిడీ దొంగల దాడిలో గాయపడిన ఐదారు మంది ప్రయాణికులకు డాల్టన్‌గంజ్ స్టేషన్లో చికిత్స అందించినట్లు చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని స్టేషన్‌కు రప్పించి రైలులోనే చికిత్స చేసినట్లు వివరించారు. కాగా, నగదు, నగలు,మొబైల్ ఫోన్లు దోపిడీపై బాధిత ప్రయాణికుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.