న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన సైనిక హార్డ్‌వేర్‌లో 81 శాతం చైనాకు చెందినదని, తన సైనిక సాంకేతికతను పరీక్షించుకునేందుకు ప్రత్యక్ష ప్రయోగశాలగా పాకిస్థాన్ని చైనా ఉపయోగించుకుంటోందని భారత సైన్యం వెల్లడించింది. ఇటీవల పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను భారత సైన్యంలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(కేపబిలిటీ డెవలప్మెంట్ అండ్ సస్టెనన్స్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మీడియాకు తెలియచేశారు.
చైనా, పాకిస్థాన్ మధ్య రక్షణ సంబంధాలు సాంప్రదాయ ఆయుధాల బదిలీకే పరిమితం కాలేదని, తన నిఘా వ్యవస్థలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధ సమయంలో పరీక్షించుకునేందుకు పాకిస్థాన్‌తో భారత్ ఘర్షణలను అవకాశంగా చైనా ఉపయోగించుకుందని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యానికి ఒక సరిహద్దు, ముగ్గురు శత్రువులు ఉన్నారని చెప్పారు. పాకిస్థాన్ ప్రత్యక్ష శత్రువుగా ముందు ఉన్నప్పటికీ ఆ దేశానికి చైనా సాయం చేసిందని, తుర్కియే కూడా పాక్‌కు తనకు చేతనైనంత సైనికపరమైన సాయం అందచేసిందని ఆయన వివరించారు.