జూన్లో 7.8 శాతానికి పెరిగిన నిరుద్యోగిత రేటు: సీఎంఐఈ
లాక్డౌన్ ఎత్తేశాక ఈ స్థాయి పెరుగుదల తొలిసారి
న్యూఢిల్లీ, జూలై 5: బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా 1.3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత రేటు 7.8 శాతానికి పెరిగింది. ఈ మేరకు మేథోసంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సోమవారం వెల్లడించింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత నిరుద్యోగిత రేటు ఒక నెలలో ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారని వివరించింది. మేలో నిరుద్యోగిత రేటు 7.12 శాతంగా ఉండేది.
మనకంటే బంగ్లా, పాక్ ఎంతో మెరుగు
దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఈ విషయంలో పొరుగు దేశాలు బంగ్లాదేశ్ (54 శాతం మందికి ఉద్యోగాలు), పాకిస్థాన్ (48 శాతం మందికి ఉద్యోగాలు) ఎంతో మెరుగ్గా ఉన్నాయి.