CM Nitish Kumar | న్యూఢిల్లీ, జనవరి 25: ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన నితీశ్ గత రెండు మూడేండ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమిని ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ బీజేపీ వైపు మొగ్గుతున్నట్టు సమాచారం.
ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీశ్ తిరిగి బీజేపీ పంచన చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. ‘గాలి తన దిశను మార్చుకున్నట్టు నితీశ్ తన విధానాలను మార్చుకోవడం సహజమే’ నంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య శుక్రవారం ట్వీట్ చేశారు. ఇక ఇంతకాలం నితీశ్‌ను ఎట్టిపరిస్థితిల్లోనూ తమ దరిదాపుల్లోకి రానివ్వబోమని బీరాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
బీజేపీ బీహార్ నేతలు నితీశ్ రాకను వ్యతిరేకిస్తుండగా, జాతీయ నాయకులు మాత్రం ఇప్పటికే ఆయన పట్ల తమ సానుకూలతను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. గతంలో జరిగిన చేదు అనుభవాలను బట్టి కాకుండా తమ భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల ఆధారంగా తమ పార్టీ నడుచుకుంటుంది అని ఓ బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్య.. నితీశ్ పట్ల ఆ పార్టీ సానుకూలతను వ్యక్తం చేస్తున్నది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం నితీశ్ పట్ల సానుకూలంగా స్పందించారు. జనతాదళ్ (యూ) అధ్యక్షుడు తిరిగి బీజేపీ కూటమిలో చేరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు అమిత్‌షా స్పందిస్తూ.. అటువంటి ప్రతిపాదన ఏదైనా వస్తే తమ పార్టీ తప్పనిసరిగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. నితీశ్‌కు తలుపులు మూసేశాం అని గతంలో ప్రకటించిన అమిత్‌షా ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడం బీజేపీలో చర్చనీయాంశమైంది.
నితీశ్‌కు ఇది మామూలే
కొంతకాలం ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమితో కొనసాగడం, ఆ తరువాత వెంటనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి దూకడం నితీశ్‌కు నీళ్లు తాగినంత పని. బెట్టియాలో వచ్చే నెల 4న జరుగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీతో కలిసి నితీశ్ వేదికను పంచుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
పార్టీ ఎమ్మెల్యేలతో పాట్నాలో సమావేశమైన నితీశ్ తన నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలుస్తున్నది. ముందుగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని ఆ తరువాత బీజేపీ, జీతన్‌రాం మాంఝీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారని జేడీయూ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త క్యాబినెట్ ఏర్పడిన తరువాత అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లే యోచనలో నితీశ్ ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఆర్జేడీతో పొసగక..
తన స్థాయికి, హోదాకు తగిన స్థానం ఇండియా కూటమిలో దక్కకపోవడం, లోక్‌సభతోపాటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న ఆయన ప్రతిపాదనకు ఆర్జేడీ మద్దతునివ్వకపోవడంతో నితీశ్ కినుక వహించినట్టు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో బీహార్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ తమ నాయకుడిని పరిపాలనలోనూ, రాజకీయ రంగంలోనూ తక్కువ చేసి చూస్తున్నదని నితీశ్ మద్దతుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
జేడీయూ అధ్యక్షునిగా ఉన్న లలన్‌సింగ్ పదవీకాలం పూర్తికాకుండానే అతడిని దించేసిన నితీశ్ తిరిగి పార్టీ పగ్గాలు అందుకున్నారు. నితీశ్‌కు ఎంతో నమ్మకస్తునిగా ఉన్న లలన్‌సింగ్ ఇటీవలి కాలంలో ఆర్జేడీకి చేరువయ్యాడని లేదా పార్టీలో తన సొంత ఎజెండాను అమలుచేస్తున్నాడన్న అనుమానంతోనే అతడిని అధ్యక్ష పదవినుంచి తొలగించినట్టు చెప్తున్నారు.
కూటమి మార్చడం ఐదోసారి
నితీశ్ 2013 నుంచి ఇలా కూటములు మార్చడం ఇది ఐదోసారి. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల కూటమితో కొనసాగిన నితీశ్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించారు. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజులకే తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టినప్పటికీ అన్ని విషయాలలో బీజేపీదే పై చేయి కావడంతో మళ్లీ ఆ కూటమిని వదిలేసి 2022లో ఆర్జేడీ పంచన చేరి పదవిని నిలబెట్టుకున్నారు.
తాజా పరిణామాలతో నితీశ్‌పై అటు బీజేపీలో, ఇటు స్వపక్షంలో కూడా విమర్శల దాడి తీవ్రమవుతున్నది. నితీశ్ ఒక రాజకీయ శక్తిగా పతనమవుతున్నారని, తన పరువును దిగజార్చుకుంటున్నారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా నితీశ్ నిర్ణయం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
నితీశ్‌పై ఘాటు వ్యాఖ్యలు.. లాలూ కుమార్తె క్షమాపణ చెప్పాలి: బీజేపీ
పాట్నా, జనవరి 25: బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌పై మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ రాష్ట్ర బీజేపీ గురువారం డిమాండ్ చేసింది. సింగపూర్‌లో ఉంటున్న రోహిణి అమర్యాదకర భాషను ఉపయోగించి ఎక్స్‌లో కొన్ని పోస్టులు చేసి, అనంతరం తొలగించారని బీహార్ బీజేపీ నేత నిఖిల్ అహ్మద్ ఆరోపించారు.
కాగా, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించిన సందర్భంగా బుధవారం ఆయన జయంతి ఉత్సవాల్లో నితీశ్ వారసత్వ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఠాకూర్ బాటలోనే తమ పార్టీ పయనిస్తూ కుటుంబ సభ్యులెవరికీ ఎలాంటి పదవులు కేటాయించడం లేదని ఆయన పరోక్షంగా లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. దానిపై రోహిణి ఆచార్య నితీశ్‌పై ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసి, అనంతరం వాటిని తొలగించారు.
పావులు కదుపుతున్న లాలూ
ఇండియా కూటమిలో నుంచి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ వైదొలగితే.. బీహార్‌లో ప్రభుత్వం కుప్పకూలుతుంది. నితీశ్ తన ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుంటూ బీజేపీతో మళ్లీ జట్టుకడితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచగలుగుతారు. మరోవైపు జేడీయూ నుంచి ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తనవైపు లాక్కొని ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పావులు కదుపుతున్నది. బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122.. కాగా ఆర్జేడీకి కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ పార్టీలు మద్దతునిస్తున్నాయి.
ఈ మూడు పార్టీలకు కలిపి (ఆర్జేడీ 79, కాంగ్రెస్ 19, లెఫ్ట్ 16) 114 సీట్లు ఉన్నాయి. జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏం పార్టీకి 4, మజ్లిస్‌కు ఒకటి, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. వీరు కూడా ఆర్జేడీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నట్టు పరిశీలకులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ మరో ఇద్దరి మద్దతు అవసరమవుతుంది. అలా కాకుండా మొత్తంగా జేడీయూను చీల్చడంపైనే ఆర్జేడీ తన దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తున్నది.