న్యూఢిల్లీ : 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 161 శాతం పెరిగాయి. ఇందులో అధికార బీజేపీకే అగ్రతాంబూలం దక్కింది. ఇతర అన్ని జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల కన్నా 10 రెట్లకు పైగా బీజేపీపైనే దాతలు మొగ్గు చూపారని అసోసియేటెడ్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గురువారం విడుదల చేసిన తన నివేదికలో తెలిపింది. జాతీయ పార్టీలు ప్రకటించిన రూ. 20,000 పైబడిన విరాళాలు మొత్తం కలిపితే రూ.6,648.563 కోట్లు. వీటిలో బీజేపీకి మాత్రమే రూ.6,074.015 కోట్లు లభించాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌కు రూ.517.394 కోట్లు లభించాయి. బీజేపీకి వచ్చిన విరాళాలు మిగిలిన జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల కంటే పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
2023-24తో పోలిస్తే 2024-25లో జాతీయ పార్టీల మొత్తం విరాళాలు రూ. 4,104.285 కోట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొన్నది. బీజేపీ విరాళాలు 171 శాతం పెరిగాయి. కాంగ్రెస్‌కు లభించిన విరాళాల్లో 84 శాతం పెరుగుదల ఉంది. 2023-24లో కాంగ్రెస్‌కు లభించిన విరాళాలు రూ. 281.48 కోట్లు ఉండగా 2024-25లో రూ.517.394 కోట్లకు పెరిగాయి. ఆప్‌కు రూ. 27.044 కోట్ల విరాళాలు లభించాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 244 శాతం ఎక్కువ. ఎన్పీఈపీకి రూ. 1.943 కోట్ల విరాళాలు లభించగా పెరుగుదల 1,313 శాతం ఉంది. తాము రూ.20,000 కంటే ఎక్కువ మొత్తంలో విరాళాలు స్వీకరించలేదని బీఎస్పీ ప్రకటించింది.
మొత్తం విరాళాల్లో 92.18 శాతం అంటే రూ. 6128.787 కోట్ల కార్పొరేట్ విరాళాలే ఉన్నట్లు నివేదిక తెలిపింది. 7,900 మంది విరాళాల ద్వారా రూ. 505.66 కోట్లు జాతీయ పార్టీలకు లభించాయి. 2,794 కార్పొరేట్ విరాళాల ద్వారా రూ. 5,717.197 కోట్లు బీజేపీ అందుకుంది. ఇతర జారీయ పార్టీలు పుచ్చుకున్న మొత్తం కార్పొరేట్ విరాళాల కన్నా ఇది 13 రెట్లు ఎక్కువ. ఇతర రాజకీయ పార్టీలు అన్నిటికీ కలిపి రూ.411.62 కోట్లు కార్పొరేట్ విరాళాలు లభించాయి. 2,627 వ్యక్తిగత దాతల నుంచి రూ. 345.94 కోట్లను ఈ పార్టీలు స్వీకరించాయి. 112 కార్పొరేట్ విరాళాల ద్వారా రూ. 383.86 కోట్లు, 2,357 మంది వ్యక్తిగత దాతల నుంచి రూ. 132.39 కోట్లు కాంగ్రెస్‌కు లభించాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు రూ. 2180.71119 కోట్లు బీజేపీకి, రూ. 216.435 కోట్లు కాంగ్రెస్‌కు విరాళంగా అందజేసింది. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు రెండు విరాళాల ద్వారా రూ. 834.97 కోట్లు అందచేసింది. 16 విరాళాల ద్వారా ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ. 621కోట్లు అందజేసింది. న్యూ డెమొక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్టు 7 విరాళాల ద్వారా రూ. 155 కోట్లు బీజేపీ, కాంగ్రెస్‌కు అందజేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 విరాళాల ద్వారా రూ. 100 కోట్లు అందజేసింది.