చెన్నై, సెప్టెంబర్ 10: తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తుకు మళ్లీ బీటలు వారాయి. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) నాయకత్వంలో జోక్యం పెరిగిపోతుండడం పట్ల ఆ పార్టీ నాయకులలో తీవ్ర అసమ్మతి ఏర్పడుతోంది. బీజేపీ చేసే ప్రయోగాలకు మూల్యం చెల్లించడానికి బదులు ఎన్డీఏ కూటమి నుంచి బయటపడడమే మంచిదని అన్నా డీఎంకే నాయకుల నుంచి ఈపీఎస్‌కి రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. బహిష్కృత అన్నాడీఎంకే నాయకుడు ఓ పన్నీర్‌సెల్వం సొంతంగా కొత్త పార్టీ పెట్టుకోవాలని భావిస్తుండగా డిసెంబర్ వరకు వేచి ఉండాలని ఢిల్లీ నుంచి బీజేపీ నాయకత్వం ఆయనకు నచ్చచెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకేలోకి పునఃప్రవేశం కోసం ప్రయత్నాలు జరిపేందుకు తమకు కొంత సమయం కావాలని ఓపీఎస్‌ని ఢిల్లీ నాయకులు కోరినట్లు సమాచారం.
అసమ్మతి రాజేస్తున్న బీజేపీ
2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్‌ని ప్రకటించకపోతే ఎన్డీఏలోకి తిరిగివచ్చే విషయాన్ని పరిశీలిస్తానని అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) అధ్యక్షుడు, మరో అన్నాడీఎంకే మాజీ నాయకుడు టీటీవీ దినకరన్ గత ఆదివారం ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ తమిళనాడులో ఎన్డీఏపై ఆధిపత్యం చెలాయించడానికి బీజేపీ చేస్తున్న పన్నాగాలుగా అన్నాడీఎంకే నాయకత్వం అనుమానిస్తోంది. దినకరన్ ప్రకటన వచ్చిన రోజే పార్టీ సీనియర్ నాయకుడు కేఏ సెంగొట్టియన్ని అన్ని సంస్థాగత బాధ్యతల నుంచి ఈపీఎస్ తప్పించారు. సెంగొట్టియన్ చేసిన నేరమల్లా బహిష్కృత నాయకులు అందరినీ పార్టీలోకి మళ్లీ తీసుకోవాలని డిమాండు చేయడమే. మాస్ నాయకుడు కాని సెంగొట్టియన్ ఈ రకంగా పార్టీ నాయకత్వ వైఖరికి వ్యతిరేకంగా డిమాండు చేయడం వెనుక బీజేపీ నాయకత్వం హస్తముండవచ్చని ఈపీఎస్ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హరిద్వార్ యాత్రకు వెళుతున్నానని ప్రకటించిన సెంగొట్టియన్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని కలుసుకోవడం ఈపీఎస్ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
అవసరమైతే ఎన్డీఏను వీడాలి..
ఇదిలాఉంటే అన్నాడీఎంకేలో పునరేకీకరణ ప్రయత్నాలను తాను స్వాగతిస్తున్నట్లు ఓపీఎస్ బుధవారం ప్రకటించారు. అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని అందరూ కోరుకుంటున్నారని, అదే జరిగితే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆశయాల సాధన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. అయితే అన్నాడీఎంకే నాయకులు మాత్రం ఈ ఏకీకరణ ప్రతిపాదనను సమర్థించడం లేదు. సెంగొట్టియన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని వారు ఈపీఎస్‌ని కోరారు. ఇది మాకు సువర్ణావకాశం. మా అంతర్గత వ్యవహారాలలో బీజేపీ జోక్యం చేసుకుంటున్నట్లయితే సెంగొట్టియన్ని ముందు పార్టీ నుంచి బయటకు గెంటేసి అవసరమైతే ఎన్డీఏ నుంచి బయటపడే విషయాన్ని కూడా ఈపీఎస్ పరిశీలించాలి. ఈ కూటమిలో ఉండడం వల్ల కమ్యూనిస్టులు కాని మైనారిటీలు కాని ఇతర ప్రాంతీయ పార్టీలు కాని మాతో చేతులు కలిపే అవకాశం లేదు. ఢిల్లీ చేసే ప్రయోగాలకు మేము ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి అని అన్నాడీఎంకే నాయకుడు ఒకరు ప్రశ్నించారు. సెంగొట్టియన్ని బహిష్కరించడం ద్వారా అన్నాడీఎంకే బీజేపీపై ఆధారపడి లేదని, తమదీ స్వతంత్ర పార్టీ అన్న విషయాన్ని ఢిల్లీ నాయకులకు ఈపీఎస్ గట్టిగా చెప్పవచ్చని మరో అన్నాడీఎంకే నాయకుడు చెప్పారు.