ముంబై : మహారాష్ట్రకు రావాల్సిన ప్రతిష్టాత్మక టాటా-ఎయిర్‌బస్ ప్రాజెక్టు గుజరాత్‌కు తరలివెళ్లడం పట్ల ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్‌ల ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. గుజరాత్‌లోని వదోదరలో ఐఏఎఫ్ కోసం సీ-295 ట్రాన్స్పోర్ట్ విమానాల తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్)కు ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మహారాష్ట్ర కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మరో ప్రాజెక్టును మహారాష్ట్ర కోల్పోయిందని, ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నించాలని తాను ముడుపుల సర్కార్‌ను అప్రమత్తం చేస్తూనే ఉన్నానని గత మూడు నెలలుగా పలు ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు తరలివెళుతున్నాయో తనకు అర్ధం కావడం లేదని యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం ఏక్నాథ్ షిండే తన పదవిని కాపాడుకునేందుకు తరచూ ఢిల్లీ వెళ్లివస్తున్నారని, రాష్ట్ర పురోగతిని పక్కనపెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగు ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు కోల్పోయిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన మెగా ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించేందుకే షిండేను బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిందని ఎన్సీపీ ప్రతినిధి మహేష్ తాపసీ పేర్కొన్నారు.
ఇక గుజరాత్‌లోనే విమానాల తయారీ చేపట్టాలని ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం, ఆయా కంపెనీల మధ్య ఎంఓయూపై సంతకాలు జరగ్గా, ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నారని కొందరు ఉద్దేశపూర్వకంగా యువతను తప్పుదారి పట్టిస్తున్నారని షిండే వర్గానికి చెందిన పరిశ్రమల మంత్రి ఉదయ్ సామంత్ స్పష్టం చేశారు. ప్రాజెక్టును మహారాష్ట్రకు తీసుకువచ్చేందుకు గత ఎంఏవీ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని సామంత్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నాగ్‌పూర్‌లోని ప్రతిపాదిత స్ధలంలో ఏర్పాటు చేసేందుకు తాము ఈ ప్రాజెక్టును వెనక్కితీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సామంత్ వెల్లడించారు.