గురువారం 04 జూన్ 2020
Narayanpet - Mar 01, 2020 , 23:58:19

ఉమ్మడి జిల్లాలో ఏడుగురు మృత్యువాత

ఉమ్మడి జిల్లాలో ఏడుగురు మృత్యువాత

ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ఏడుగురు మృత్యువాత పడ్డారు.  ఇందులో ఒకరు కరెంట్‌ షాక్‌తో మృతి చెందగా, కాలువలో పడి ఒకరు, చెరువుల్లో పడి ఇద్దరు,  ఆత్మహత్య చేసుకొని ఇద్దరు మృతి చెందారు. మరోచోట గుర్తు తెలియని వ్యక్తి శవం లభిచింది.

విద్యుదాఘాతంతో ఫొటోగ్రాఫర్‌..

జడ్చర్ల రూరల్‌ : ఓ వివాహ వేడుకలో ఫొటోలు తీస్తుండగా ఫొటోగ్రాఫర్‌ విదుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మంగలితండా పంచాయతీ పరిధిలోని చంద్రుతండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మిడ్జిల్‌ మండలంలోని చంద్రుతండాకు చెందిన జర్పుల రవి(25) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.  జడ్చర్ల మండలంలోని చంద్రుతండాలో  ఓ వివాహ వేడుకలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఆదివారం వివాహ వేడుకలో ఫొటోలు తీస్తుండగా ప్రమాదవశాత్తు వీడియో తీసే విద్యుత్తు వైర్లు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై రవి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన పోస్టుమార్టం గదికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికు తండ్రి రెడ్యా నాయక్‌, తల్లి లక్ష్మి ఉన్నారు.

కాలువలో పడి వ్యక్తి ..

తాడూరు : కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండ లంలోని తుమ్మలసూర్‌ గ్రామ శివారులోని కేఎల్‌ఐ కాలువలో పర్వతాయిపల్లి గ్రామానికి చెందిన దాసరి యాదయ్య(35) శవం కాలువలో పడి కొట్టుకొచ్చింది. పర్వతాయిపల్లికి చెందిన యాదయ్య ఫిబ్రవరి 28వ తేదీన నాగర్‌కర్నూల్‌కు పని నిమిత్తం తన బైక్‌పై బయల్దేరి వెళ్లాడు. యాదయ్య బైక్‌ గురించి వెతకడంతో తుమ్మలసూర్‌, చర్లఇటిక్యాల మధ్యల ఉన్న కేఎల్‌ఐ కాలువ బ్రిడ్జి కింద అతని బైకు నీళ్లలో పడి కన్పించింది. మృతుడు యాదయ్య నాగర్‌కర్నూల్‌లో పని ముగించుకొని వస్తుండగా కాలువలో పడి చనిపోయినట్లు తెలిపారు. కుటుబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

చెరువులో పడి వ్యక్తి ..

గోపాల్‌పేట :  ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని తాడిపర్తి లక్ష్మీసముద్రం చెరువువద్ద చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... చెన్నూరు వెనికి తండాకు చెందిన సక్రునాయక్‌ (49) సేవింగ్‌ చేయించు కునేందుకు తాడిపర్తి వెళ్లి తిరుగు ప్రయాణంలో లక్ష్మీ సముద్రం కట్టపై నుంచి వెళ్తే ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు. ఇది చూసిన బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వెతికించగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ధవాఖానకు తరలించారు.

చేపల వేటకువెళ్లి వ్యక్తి..

రేవల్లి : మండల పరిధిలోని చెన్నారం గ్రామంలోని కురువోనికుంటకు చేపల వేటకు వెళ్లిన పుట్టరాజు(35) చెరువులో శుక్రవారం రాత్రి పడిపోయాడు. ఆదివారం సాయంకాలం శవం బయట పడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన స్థానిక ఎస్సై వివరాల ప్రకారం.. కోడేరు మండలం మాచుపల్లికి చెందిన రాజు శుక్రవారం సాయంత్రం చేపల వేట కోసం వల తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. చెన్నారం శివారులోని కురువోనికుంటలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఆదివారం శవం కుంటలో తేలడంతో చుట్టుపక్కల రైతులు గుర్తు తెలియని శవంగా భావించి పోలీసులకు తెలిపారు. విషయం తెలిసిన మృతుడి భార్య శివలీల తనభర్తగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై ఆమె ఫిర్యాదు మేరకు శవానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

పెద్దకొత్తపల్లి : ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దకొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండల పరిధిలోని వెన్నచర్ల గ్రామానికి చెందిన నిరంజన్‌, వెంకటమ్మల కుమారుడైన మహేశ్‌(22)ను అదే గ్రామానికి చెందిన మధు, కిషన్‌, శంకర్‌లు అక్రమ సంబంధం కలిగి ఉన్నావని వేధించడంతో మనస్థాపానికి గురై శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కుర్మయ్య తెలిపారు. మృతుడి తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.

తాగుడుకు బానిసై వ్యక్తి ..

దామరగిద్ద : ఓ వ్యక్తి తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండంలోని బాపణపల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... బాపన్‌పల్లి గ్రామానికి చెందిన సుతారి హన్మంతు(40) కొన్ని రోజులుగా తాగుడుకు బానిసై తరుచూ తాగి వచ్చి భార్యను కొట్టేవాడన్నారు. గత రాత్రి కూడా తాగి భార్యతో గొడవ పడటంతో భార్య వెంకటమ్మ (35) ఇద్దరు కూతుళ్ళు ఇంటి బయట పడుకున్నారన్నారు. ఉదయం లేచి బహిర్భూమికి వెళ్ళిన హన్మంతు తిరిగి ఇంటికి వచ్చాడన్నారు. ఆ తర్వాత ఇంట్లోకివెళ్లి పురుగుల మందు తాగాడన్నారు. వాంతులు చేసుకోవడాన్ని గమనించిన భార్య ఇరుగుపొరుగు వారి సహాయంతో నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మరణించాడని వారి బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై రాంబాబు తెలిపారు. 

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గద్వాల అర్బన్‌ : ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జోగుళాబ గద్వాల జిల్లా సమీపంలో చోటు చేసుకుంది. గద్వాల రూరల్‌ ఎస్సై అరుణ్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. గద్వాల మండలం పరిధిలోని మేలచేర్వు శివారు ప్రాంతంలోని పిలిగుండ్ల దగ్గర ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయిందని పేర్కొన్నారు. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు వివరించారు. ఈ సంఘటన జరిగి దాదాపు 7, 8 రోజులు అయి ఉండవచ్చని అంచనా వేశారు. సంఘటనా స్థలంలో కొంత దూరంలో మద్యం బాటిళ్లు పడి ఉన్నట్లు గుర్తించారు. మృతుదేహం పూర్తిగా కుళ్లి పోవడంతో ఎలాంటి ఆనవాళ్లు కనబడడం లేదన్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.


logo