నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) ; గతేడాది ఎన్నికలం అనంతరం కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ సారి రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంతో పాటు జిల్లాకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు పట్టాలు ఎక్కుతాయన్న ఆశాభావం వ్యక్తమైంది. కానీ అందుకు భిన్నంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన ఈ ఏడాది కూడా లేదు. త్రిపుల్ ఆర్, హైస్సీడ్ రైల్, ఇతర రైలు మార్గాలు, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు లాంటి డిమాండ్లకు మోక్షం లభించలేదు. జిల్లాకు సంబంధించి ఒక్క కేంద్ర విద్యాలయానికి కూడా చోటు లేదు. వైద్యపరంగానూ ఊరట లభించలేదు. వ్యవసాయ రంగంలోనూ నేరుగా ప్రయోజనం కలిగే అంశాలు పెద్దగా లేవు. కాగా వేతనజీవులకు ఐటీ పరిమితి పెంపుతో మాత్రం ఊరట లభించగా ఉపాధి హామీకి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా లేదు. కాగా జిల్లాకు సంబంధించిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరూత్సాహంగా, నిరాశపూరితంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు కీలకమైన పలు ప్రాజెక్టులకు ఈ సారైనా ప్రాధాన్యత దక్కుతుందని ఆశించారు. ప్రపంచంలో అత్యంత అధికంగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడు నియోజకవర్గానికి గతంలోనే ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రకటించారు. గతంలో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శంకుస్థాపన చేసినా.. మరోసారి కూడా దాని ప్రస్తావన కనిపించలేదు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సైతం నిధులు కనిపించలేదు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రూ.14వేల కోట్ల నిధులు కావాలని పదేపదే విజ్ఞప్తి చేసినా కనికరించినట్లు లేదు. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో డిమాండ్లుగా ఉన్న పలు విద్యాసంస్థలకు ఈ సారి కూడా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. జిల్లాకో సైనిక్ స్కూల్ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుపైనా మరోసారి నిరాశే మిగిలింది. వీటితో పాటు నల్లగొండ, మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయాలు, చలకుర్తి నవోదయ విద్యాలయాల అప్‌గ్రేడేషన్ డిమాండ్లు అలాగే ఉన్నాయి. ఇక రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పింక్ బుక్ వస్తేనే గానీ ఏం ప్రాజెక్టులు, నిధులు వచ్చాయో క్లారిటీ వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక ఉద్యోగుల ఐటీ పరిమితి 12 లక్షల రూపాయలకు పెంచడం పట్ల సానుకూలత వ్యక్తమవుతున్నది. దీని వల్ల అదనంగా మరో 10వేల మంది ఐటీ చెల్లింపుదారులకు ఊరట లభించనుందని అంచనా.
ఎన్నో ప్రతిపాదనలు.. ఒక్కటీ రాలే..
యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో బీజేపీ అనేక హామీలు కూడా ఇచ్చింది. కానీ బడ్జెట్లో మాత్రం ఎప్పుడూ రిక్తహస్తమే చూపుతున్నది. కేంద్ర బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి విద్యాసంస్థలు మంజూరు చేయలేదు. జవహార్ నవోదయ పాఠశాలు మంజూరు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా పరిగణలోకి తీసుకోలేదు. భువనగిరిలోని బొమ్మాయిపల్లిలో 120 ఎకరాల్లో సీసీఎంబీ ఏర్పాటు, భువనగిరి ఇండస్ట్రియల్ పార్క్, దండుమల్కాపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, భువనగిరి-రాయగిరిలో ఎనిమిది లేన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటును గాలికొదిలేసింది. ఇక భువనగిరి ఖిలాకు ఎప్పుడూ మొండిచెయ్యే ఎదురవుతున్నది. మూసీ ప్రక్షాళనకు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపినా.. ఎక్కడా ప్రస్తావించలేదు.
రైల్వే ప్రాజెక్టులకూ అంతే..
రైల్వే ప్రాజెక్టులపై ఏం వచ్చాయో.. రాలేదో చెప్పలేని పరిస్థితి. అసలు రాష్ర్టానికే ఏమిచ్చారో తెలియడంలేదని ఎంపీలు పేర్కొంటున్నారు. జిల్లా కు గుండుసున్నా మిగిలిందని తెలుస్తున్నది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలి. బీబీనగర్-నడికుడి డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు నిధులు కేటాంచాల్సి ఉంది. హైదరాబాద్- విజయవాడకు హైస్పీడ్ రైలు ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది. భువనగిరి -రాయగిరి-ఆలేరు- జనగామ మధ్య నడిచే పుష్ఫుల్ రైలు ట్రిప్పులు పెంచాలి. హైదరాబాద్-విజయవాడ త్రిబుల్ లైన్‌కు నిధులు కావాలి. ఎంపీలు చెబుతున్న సమాచారం ప్రకారం దీనిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. రాయగిరి, భువనగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పలు రైళ్ల హాల్ట్‌ను పరిగణలోకి తీసుకోలేదు. సికింద్రాబాద్-కాజీపేట మూడోలైన్‌కు నిధులపై స్పష్టత రావాల్సి ఉంది.
ట్రిపుల్ ఆర్ ప్రస్తావన ఏది..?
ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సైతం నిధుల ఊసు కనిపించలేదు. ఇప్పటికే ఉత్తరభాగం ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచినా బడ్జెట్లో మాత్రం నిధుల కేటాయింపు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50శాతం నిధులు భరించనున్నాయి. భూ సేకరణకు నిధులు అవసరం. కీలక ప్రాజెక్ట్‌ను సైతం పట్టించుకోలేదు. ఇక రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్ రైలు లైనుకు బడ్జెట్లో నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. రీజినల్ రింగు రైలుకు సంబంధించిన ఫైనల్. లొకేషన్ సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. అలైన్ మెంట్, డీపీఆర్ తయారీపై రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించడంతో నిధులు కేటాయిస్తే పనులు ఊపందుకునేవి.
రైతు వ్యతిరేక బడ్జెట్
70 శాతంగా ఉన్న రైతులకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కంటి తుడుపు చర్యగానే కేటాయింపులు ఉన్నాయి. ఎరువులపై సబ్సిడీ తగ్గించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమ లేదని నిరూపితమైంది. ఇది ధనవంతులకు అనుకూలమైన బడ్జెట్. అంకెల గారడి తప్ప పేదలు, మహిళలకు ఒరిగిందేమీ లేదు. ఢిల్లీ, బిహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా అర్థమవుతుంది.
-బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎంపీ
గ్రామీణాభివృద్ధిని విస్మరించిన కేంద్రం
కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, సామాన్య, పేద వర్గాలకు వ్యతిరేకంగా ఉంది. ఈ బడ్జెట్లో తెలంగాణ విభజన అంశాలుగాని, తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులుగాని లేవు. కేవలం ఎన్నికలు ఉన్న బిహార్ రాష్ర్టానికి నిధుల తప్ప తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న. గత కొన్ని రోజులుగా పంటలకు మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నా వాటి గురించి పట్టించుకోలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏమీ పేర్కొనలేదు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ అభివృద్ధిని విస్మరించింది. వికసిత్ భారత్ నినాదంతో కేంద్రం మోసపూరిత బడ్జెట్‌ను రూపొందించింది.
– నెల్లికంటి సత్యం, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి
కార్పొరేట్ శక్తులకు పెద్దపీట
ప్రజల శ్రమను దోచుకునే కార్పొరేట్ శక్తులు, బడా పెట్టుబడిదారులకు రాయితీలు, సబ్సిడీలు కల్పించేలా ఉంది కేంద్ర బడ్జెట్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ప్రవేశపెట్టిన బడ్డెట్లో ప్రజలకు ప్రయోజనం చేకూరిందేమీ లేదు. వ్యవసాయ రంగంలో రోజుకు 34 మంది ఆత్మహత్యలు జరుగుతుంటే వాటి నివారణకు ఏమి చర్యలు తీసుకుంటుందో బడ్జెట్లో పేర్కొన లేదు. పెట్రోల్, గ్యాస్ ధరల నియంత్రణ తెలుపలేదు. వేతన జీవులు, ట్యాక్స్ కట్టే వారికి ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వలేదు. మొత్తంగా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే విధంగా ఉంది.
– తుమ్మల వీరారెడ్డి, సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి
మధ్య తరగతి వర్గాలకు కొంత ఊరట
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి వర్గానికి కొంత ఊరట కలిస్తుంది. ఆదాయపు పన్ను 12లక్షల రూపాయల వరకు లేదని పేర్కొనడం సంతోషకరం. ఆదాయం 12లక్షలు దాటితే 4లక్షల వరకు పన్ను ఉండదు. ఇప్పుడు ఈ పరిమితి 3లక్షల వరకు ఉన్నది. వాస్తవానికి ద్రవ్యోల్బనాన్ని పరిగణలోకి తీసుకుని ఈ పరిమితిని కనీసం 7లక్షలకు పెంచితే సమంజసంగా ఉండేది. విద్య, వైద్యంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొఠారి కమిషన్ సిఫార్సులు పట్టించుకోవాలి.
-అక్కెనపల్లి మీనయ్య, విశ్రాంత ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు
ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వని బడ్జెట్
ద్రవ్యోల్బణం దెబ్బకు విలవిల్లాడుతున్న మధ్యతరగతి ప్రజానీకానికి ఉపశమాన్ని కలిగించే చర్యలేమీ ఈ బడ్జెట్లో లేవు. ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు రూపాయి మారకపు విలువ పతనం, ఎదుగుబొదుగూ లేని వేతనాలతో దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నా వాటి కట్టడికి చర్యలేమీ లేవు. వృద్ధిరేటు అంచనాలకు మించి క్షీణించడం, ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందన్న ముందస్తు అంచనాలు ఆర్థిక మందగమనాన్ని సూచిస్తున్నా జీడీపీ వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయింపులు లేవు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చి వారి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్య తీసుకోలేదు. దేశంలో 66 శాతం మంది 35 ఏండ్ల లోపు వారు ఉన్నారు. 2024లో నిరుద్యోగ రేటు 10.2 శాతంగా ఉంది. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ బడ్జెట్లో చర్యలేమీ లేకపోవడం శోచనీయం.
– టి. నర్సింహమూర్తి, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా నాయకుడు, నకిరేకల్
అంకెల గారడి బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిలా ఉంది. బడ్జెట్లో రైతాంగానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. వ్యవసాయ రంగానికి నిధులు పెంచకుండా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఊసే లేకుండా ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ బడ్జెట్ కార్పొరేట్, పెట్టుబడిదారి శక్తులకు పెద్ద పీట వేసింది. విద్య, వైద్య, ఉపాధి రంగాల ఊసే లేకపోగా సబ్సిడీలను పూర్తిగా తగ్గించి ప్రజలపై పన్నుల భారం మోపారు. వ్యవసాయరంగానికి 2శాతం నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు.
-మల్లు నాగార్జున్‌రెడ్డి, సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి