నీలగిరి, జూన్ 25 : డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్ సోల్జర్‌గా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోని చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత తమ శక్తియుక్తులను మత్తు పదార్థాలకు అలవాటు పడి వృథా చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు.
మత్తు పదార్థాల భారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్ నాశనం అవుతోందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్థిక సమస్యలు, సమాజంలో గౌరవం లేకుండా పోతుందన్నారు. యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదైతే భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు, ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందన్నారు. ఎవరైనా గంజాయి డ్రగ్స్ సేవిస్తే NDPS చట్టం-1985 తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కు సమాచారం తెలుపాలన్నారు. అనంతరం నేను మాదక ద్రవ్యాల నిరోధకతపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Nalgonda : యువత యాంటీ డ్రగ్ సోల్జర్‌గా పనిచేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda : యువత యాంటీ డ్రగ్ సోల్జర్‌గా పనిచేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్