మునుగోడు, జూలై 26 : డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి నాయక్, మల్లం మహేశ్ అన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లను అరికట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్ర శనివారం మునుగోడు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సత్య ఫంక్షన్ హాల్ లో కట్ట లింగస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వాగత సభలో వారు మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. రోజురోజుకు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయన్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌ల ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకుని అనేక కుటుంబాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు.
యువత ఎక్కువగా వీటికి బానిసలుగా మారుతున్నారు. కావున ప్రభుత్వాలు వీటిని పూర్తిగా అరికట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్ మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుందని, ఆ మైకంలో అనేక నేరాలు చేస్తున్నట్లు తెలిపారు. యువత చెడు దారి పట్టకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సైకిల్ యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, వడ్డగాని మహేశ్, గుండాల నరేశ్, రాజేశ్, చంద్రశేఖర్, గోపి, నాయకులు బొడ్డుపల్లి నరేశ్, పంది నరేశ్, యాట శ్రీకాంత్, పగిళ్ల సాయి తేజ, చరణ్, ప్రభాస్ పాల్గొన్నారు.