నీలగిరి, ఆగస్టు 14 : మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విద్యార్థులు, యువతకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్‌పై బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, మత్తు బారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని తెలిపారు. విద్యార్థులు ఏ రంగంలో ప్రతిభ చాటవచ్చో గుర్తించి అటువైపు ప్రయాణించేలా చూడాలన్నారు. జీవితంలో ఏది సాధించాలన్నా కృషి, పట్టుదల అవసరమని పేర్కొన్నారు.
కష్టపడే ఆలోచనా విధానంపై దృష్టి పెట్టాలని, మంచివారితో స్నేహం చేయాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు. మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. రెండో జోనల్ ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని దుష్పరిణామాలేనని, యువత మంచిని కోరుకునే వైపు వెళ్లాలని అన్నారు.
చెడు వ్యసనాల వల్ల చెడుదారి పడుతారని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ సమాజమంతా సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్ కోల్పోతారని అన్నారు. జిల్లాలో గంజాయి వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎవరూ గంజాయిని వాడవద్దని, దాని వల్ల జరిగే దుష్పరిణామాలు, ఆరోగ్యం చెడిపోయే తీరును ఆయన వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అనంతరం మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, డానియల్ కుమార్, ఎస్ఐలు రావుల నాగరాజు, సైదాబాబు, సురేశ్ పాల్గొన్నారు.