అర్వపల్లి, జూన్ 25 : ఫైనాన్స్, మనీ లోన్స్ యాప్ ద్వారా లోన్ తీసుకుని ఆర్థికంగా ఇబ్బంది అవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అర్వపల్లి స్టేషన్ హౌస్ అధికారి బి.రామకోటి తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లంపల్లి గ్రామానికి చెందిన వంగాల సత్తయ్య చిన్న కొడుకు సుకుమార్ రాజు (28) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. మూడు నెలల క్రితం ఉద్యోగం మానేసి హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు.
గత ఐదు రోజుల క్రితం గ్రామంలో శివాలయ పండుగ జరుగుతున్న సందర్భంగా ఇంటికి వచ్చాడు. గతంలో SBFC ఫైనాన్స్, Slice, paytm, ప్రవేట్ మనీ లోన్ యాప్ లలో అధిక మొత్తంలో డబ్బులు లోన్ తీసుకుని ప్రతి నెల అసలు, వడ్డీ చెల్లిస్తున్నాడు. ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది అవుతుండడంతో తీసుకున్న లోన్ చెల్లించలేకపోయాడు. దీంతో మానసికంగా తీవ్ర మనోవేదనకు గురై బుధవారం ఉదయం మూడు గంటల సమయంలో ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమార్ రాజు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ అధికారి తెలిపాడు.