నేరేడుచర్ల, జూన్ 22 : వైన్ షాప్లో మద్యం సేవిస్తున్న కొంతమంది యువకుల మధ్యన మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య బీభత్సమైన ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నేరేడుచర్ల పట్టణంలోని రాంపురం రోడ్డులోని వైన్ షాపులో నేరేడుచర్ల పట్టణానికి చెందిన నలుగురు యువకులతోపాటు పెంచికలదిన్నె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పక్కపక్క టేబుల్లో కూర్చొని మద్యం తాగుతున్నారని తెలిపారు.
మద్యం సేవిస్తున్న సమయంలో ఇరువర్గాల మధ్య మాటకు మాట పెరిగి గొడవ జరిగి దాడి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ గొడవలో మొదట నేరేడుచర్లకు చెందిన యువకులను పెంచికల్ దిన్నకు చెందిన యువకులు చితకబాదారని చెప్పారు. ఇదే విషయాన్ని నేరేడుచర్లకు చెందిన యువకులు వారికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు మూకుమ్మడిగా వచ్చి పెంచికలదిన్నె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై వివక్షరహితంగా దాడి చేశారని సమాచారం.
అప్పటికే ఈ గొడవలు జరుగుతున్న విషయాన్ని కొందరు పోలీసుల సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు ఆపుతున్న ఆగకుండా పెంచికల్ దిన్నకు సంబంధించిన యువకులను రోడ్డుపై నుండి తన్నుకుంటూ వెళ్లి మురికి కాలువలో పడేసి మరి దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పోలీసులు పూర్తి విచారణ చేస్తే గాని మద్యం షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్లో ఏం జరిగిందనేది తెలుస్తుంది.