సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయని, అలాగే రెండేళ్లుగా అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోందని ప్రతి ఒక్కరూ ఈ తేడాను గమనించి ఓటేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం సూర్యాపేటలోని 4, 7, 15, 17వ వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టారు. యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.
ఈసందర్భంగా జగదీశ్‌రెడ్డి సమక్షంలో ఆయా వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే వార్డుల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మనం వేసే ఓటు అభివృద్ధి విషయంలో మార్పు తేవాలని, 2014, 2018లో కారు గుర్తుకు ఓటేస్తే ఎంత అభివృద్ది జరిగిందో అందరూ చూశారన్నారు. ఇచ్చిన హామీలే కాదు, వాటితో పాటు అనేక పథకాలు ప్రవేశపెట్టిన పెట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మాయమాటలు, మోసపూరిత వాగ్ధానాలతో జనం నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే అరాచకం, కొట్లాటలు, గొడవలు, కేసులే తప్ప అభివృద్ధి, సంక్షేమం లేదన్నారు.
రేవంత్ ఓటమి భయంతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండని, అడ్డగోలు మాటలు బూతు పురాణాలు తప్ప ఆయన భాష తీరు మారడం లేదన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మాదిరి చిల్లర రాజకీయాలు చేయబోమని, బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటిస్తారన్నారు. కేసీఆర్ నేర్పింది అభివృద్ధేనని, అరాచకాలు కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రజలంతా గులాబీ దండుకు బ్రహ్మాండమైన మద్దతు తెలుపుతున్నారన్నారు. ఇదే ఉత్సాహంతో అన్ని మున్సిపల్ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.