పెన్పహాడ్, జూన్ 21 : ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి బిజీ జీవితాల్లో మనిషి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒత్తిడి. దీంతో ప్రజలు రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక వికాసం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రవి. ఈసీ.మహేశ్, స్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ బేగం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.