నాలుగు రోడ్ల కూడలైన కొండమల్లేపల్లి పట్టణం దినదినాభివృద్ధి చెంతుతున్నది కానీ విద్యా అవకాశాల కల్పనలో వెనుకబడింది. పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు ఏండ్ల తరబడి కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయకపోవడంతో నిరుపేద విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కొండమల్లేపల్లి పట్టణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 సంవత్సరంలో 26 గ్రామ పంచాయతీలతో కలిసి మండలంగా ఏర్పాటైంది. హైదరాబాద్, నాగార్జునసాగర్, కోదాడ, జడ్చర్ల జాతీయ రహదారి కావడంతో చుట్టుపక్కల నాంపల్లి, గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి, గుడిపల్లి, చింతపల్లి, నేరేడుగొమ్ము మండలాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడి పాఠశాలలోనే విద్యార్థులు అభ్యసించేందుకు వస్తుంటారు. కొండమల్లేపల్లి మండల పరిధిలో రెండు జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎస్సీ, బీసీ, మైనారిటీ, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, పట్టణంలో ఐదుకు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉండగా దాదాపు వెయ్యికి పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతుంటారు. ఒక్క కొండమల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే 250 మందికిపైగా పదో తరగతి విద్యార్థులు చదువుతుంటారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు కొండమల్లేపల్లి పట్టణంలో జూనియర్ కళాశాల లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేక, ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు చెల్లించలేక చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారిస్తే అనేక మంది నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. జూనియర్ కళాశాల లేకపోవడం వల్ల నల్లగొండ, దేవరకొండ, హైదారాబాద్‌కు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్నది. ప్రైవేట్ కళాశాలల్లో చదువాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వ కళాశాలలు ఉంటే సమయంతోపాటు మాలాంటి నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కొండమల్లేపల్లిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తే నాలుగైదు మండలాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. కళాశాలలు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా పేద విద్యార్థుల ఉన్నత చదువులు కొనసాగే విధంగా కళాశాలలు ఏర్పాటు చేయాలి.
కొండమల్లేపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం దాదాపు 1000 మంది 10వ తరగతి, 500 మంది ఇంటర్ పాస్ అవుతున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితి ఉంది.