నల్లగొండ, జనవరి 3 : యాసంగి సీజన్లో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట వేశాడు. ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంచాడు. సర్వే నెంబర్ వంటి వివరాల సేకరణ కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి పంటల నమోదు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన క్రాప్ బుకింగ్‌పై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం వ్యవసాయాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 8 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వ్యవసాయ శాఖ యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద ఒక మండలంలో ఒక గ్రామాన్ని తీసుకుని ఒకటో సర్వే నెంబర్ నుంచి చివరి సర్వే నెంబర్ వరకు రైతు పేరు, సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, ఖాళీ ఎకరాలు నమోదు చేస్తూ ప్రభుత్వం సూచించిన ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు.
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 5,83,620 ఎకరాల్లో ఆయా పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 2,01,677 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో జొన్న, 33 ఎకరాల్లో సజ్జ, 207 ఎకరాల్లో మొక్కజొన్న, 63 ఎకరాల్లో ఆముదం, 20 ఎకరాల్లో వేరుశనగ సాగు అయింది. కాగా, సర్వే ప్రక్రియ రైతు భరోసా నేపథ్యంలో చేస్తున్నట్లు తెలుస్తున్నది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి పంట నుంచే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రకటించింది.
తొలి సీజన్లో రైతు భరోసా అమలు చేయకుండా రైతు బంధు లెక్కన రూ.5వేలు ఇచ్చింది. వానకాలం సీజన్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుంట జాగా నుంచి ఎంత భూమి ఉన్నా రైతు బంధు ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రైతులకు అవసరం లేదంటూ రైతుల అభిప్రాయాలు, మంత్రుల సబ్ కమిటీ పేరుతో కాలం గడిపింది. కాగా, తాజాగా రైతు భరోసా నేపథ్యంలో కోతలు పెట్టేందుకే సర్వే చేపడుతున్నట్లు తెలుస్తున్నది.