రామగిరి, నవంబర్ 19 : మనం ఎలా ఆలోచిస్తామో, అలాగే తయారవుతామని, మనం జీవితం కూడా అలానే మారుతుందని దీన్నే యద్భావం తద్భవతి అంటారని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకు ఆమె చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయినప్పటికీ ఇందిరాగాంధీ స్వయంగా కష్టపడి ప్రధానమంత్రి అయ్యారన్నారు. పేద ప్రజల సంక్షేమానికి “గరీబి హఠావో” నినాదాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఇందిరాగాంధీ లాగా కష్టపడి చదివి సమాజంలో మంచి స్థానానికి రావాలని ఆమె విద్యార్థినులకు పిలుపునిచ్చారు. చదువు ద్వారా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని తెలిపారు.
ఏదైనా సాధించాలనే తపన, కోరిక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా ఉంటారన్నారు. గొప్ప ఆలోచనలు, కష్టాలు ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్లో ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. మనసుకు ఎంతో శక్తి ఉంటుందని, మనసులో ఏమనుకుంటే అది సాకారం అవుతుందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రస్తుత భవనం సరిపోనందున గతంలో ఉన్న టౌన్ హాల్ స్థానంలో బాలికలకు, బాలురకు వేర్వేరుగా ఫ్లోర్లు నిర్మించి అక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎం. ఆఫీస్ ఖాన్ మాట్లాడుతూ… గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయని, నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రస్తుత భవనం సరిపోనందున కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Ramagiri : యద్భావం తద్భవతి : కలెక్టర్ ఇలా త్రిపాఠి