యాదగిరిగుట్ట, జూలై 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసింది. మాఢవీధులు, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిటికిటలాడాయి. స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా సాగాయి. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపించారు.
సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 46 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.54,03,802 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
విమానగోపురం స్వర్ణతాపడానికి 55,03,500 విరాళం
స్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్ రూ.55,03,500 విరాళం సమర్పించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజానీకంతో కలిసి యాదగిరిగుట్ట చేరుకుని నగదును ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వర్ణతాపడానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫున విరాళం అందజేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విరాళాలు అందజేయనున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో దేవాలయాలతోపాటు ఇక్కడి ప్రాంతానికి స్వర్ణయుగం పట్టిందని కితాబిచ్చారు.