సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ):నారసింహ క్షేత్రం లో ఓ అధికారి చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా జరుగుతోంది. ఆలయంలో అసిస్టెంట్ అధికారిగా పనిచేస్తున్న ఆయన తాను పక్కా లోకల్ అంటూ అక్కడకు వచ్చే అధికారులను తనకున్న రాజకీయ పలుకుబడితో బెదిరించడం, ఎన్ని అక్రమాలకు పాల్పడినా చూసీచూడనట్లు వదిలేయాలంటూ స్థానిక నేతలతో చెప్పించడంతో ఆ అధికారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఓ ముఖ్య అధికారిపై బదిలీ వేటు వేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈయన అక్రమాలపై సమాచారం అందింది. దీంతో వారు అసలు ఆ క్షేత్రంలో ఏం జరుగుతున్నదంటూ ఆరా తీస్తున్నారు.
ఇటీవల విదేశీ కల్యాణాలు, డాలర్ల అక్రమా ల్లో ఆడిట్ అభ్యంతరాల నేపథ్యంలో రూ.7లక్షలు చెల్లించిన ఉద్యోగుల్లో ఈ అధికారి పేరు లేకుండా మేనేజ్ చేశారన్న చర్చ జరుగుతోంది. ఈ క్షేత్రంలో పనిచేస్తున్న అధికారుల్లో కొందరు అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు అయితే ఒక అధికారి మాత్రం వీరందరికీ భిన్నంగా ఉంటూ స్థానిక ప్రజాప్రతినిధితో తనకున్న పలుకుబడితో అధికారులను బెదిరిస్తూ ఆలయంలో జరిగే ప్రతి వ్యవహారంలో తన వాటా తనకు దక్కేలా స్కెచ్ వేసుకున్నాడు. రెండున్నరేళ్లుగా తన స్నేహితుడైన ఒకనేత అండదండలతో ఈ అధికారి చేస్తున్న దందాతో అతను కోట్లరూపాయలకు పడగెత్తాడనే చర్చ జరుగుతోంది.
ఆయనవన్నీ అక్రమాలే..!
దేవస్థానంలో సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి, అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి వరకు ఎదిగిన ఆ ఉద్యోగి స్థానికుడు కావడంతో ఆయన చేసిందే శాసనంగా దేవస్థానంలో నడుస్తుంది. అసలు ఆ ఉద్యోగి ప్రమోషన్లలోనే అక్రమాలు జరిగాయని, అతడికి అర్హత లేకున్నా పదోన్నతి కట్టబెట్టి చివరకు ఈ స్థాయికి రావడం వెనుక లోకల్ బెదిరింపులు ఉన్నాయని దేవాదాయశాఖ అధికారులే చెప్పుకుంటున్నారు. దేవాలయానికి ఏ అధికారి ముఖ్య బాధ్యతల్లో వచ్చి పోయినా తాను మా త్రం లోకల్ అంటూ పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పట్టణంలో ఆయన నిర్మించిన ఇంటి విలు వ సుమారు ఐదుకోట్ల ఉంటుందని ఆ క్షేత్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానికుడైన ఆ అధికారికి అధికార పార్టీకి చెందిన ఓ నేత అండదండలు భారీగా ఉండడంతో ఆలయ ఉద్యోగులంతా అసిస్టెంట్ అధికారి చెప్పిందే చేస్తూ అడిగినంత ఇస్తూ కష్టమైనా నష్టమైనా అప్పోసప్పో చేసి ముడుపులు చెల్లిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ప్రతినెలా సుమారు పదినుంచి పదిహేను లక్షలకు పైగా ఆ అధికారి సంపాదన ఉండగా అందులో అధికార పార్టీ నేతతో పాటు పలువురు ఉన్నతాధికారులకు కూడా వాటాలు అందుతాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఉద్యోగి అక్రమార్జన, ఆదాయానికి మించిన ఆస్తులపై సాక్షా త్తు మంత్రే గతంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయి నా ఫలితం లేదని తెలుస్తోంది. ఇటీవల చింతపండు కుంభకోణంలో ఈ అధికారే కీలకమంటూ కమిటీ నిర్ధారించే సమయంలో కమిటీలో ఉన్న ఓ కీలక అధికారితో పాటు ఆ శాఖలో ప్రస్తుతం ఉన్న ఓ ఉన్నతాధికారికి రూ.లక్షల ముడుపులు సమర్పించుకొని క్లీన్‌చిట్‌తో బయటపడ్డారని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా దేవస్థానం వద్ద ఉన్న షాపుల్లో నూ ఈ ఉద్యోగికి ఐదారు షాపులు ఉన్నాయని, అవన్నీ బినా మీ పేర్లతో ఉంటాయని చెప్పుకుంటున్నారు.
తనపైకి రాకుండా ప్రయత్నాలు..!
దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ఆడిట్ శాఖ నివేదిక కోరింది. అందులో పలు అవకతవకలు బయటపడడంతో ఆడిట్ శాఖ వీటిపై అభ్యంతరాలు తెలిపింది. ఇందులో తన పేరు రాకుండా స్థానిక నేతతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ అధికారి ఇన్నాళ్లూ తననే నమ్మిన ఓ ప్రధాన అధికారికి వెన్నుపోటు పొడిచారంటూ దేవస్థానంలో మాట్లాడుకుంటున్నారు. అతని అక్రమాలను కప్పిపెట్టి ఉంచినందుకు ఆ అధికారిపై తన స్నేహితుడైన ఆ నేతను ఉసిగొల్పి అతనిపై దేవాదాయశాఖ మంత్రికి, కమిషనర్‌కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ హస్తం నేతతో లేఖలు రాయించి చివరకు అతడిపై బదిలీవేటు పడేలా చూశా రు. అయితే అక్రమాల జాబితాలో తాను కూడా ఉండటంతో ఈ వ్యవహారంలో ఎక్కడా తన పేరు వచ్చినా తనపై చర్యలు లేకుండా చూడాలంటూ ఆనేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని గుట్టలో చర్చ జరుగుతోంది.