యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 21: ఉదయం వటపత్రశాయిగా.. రాత్రి హంసవాహన సేవలో స్వామివారి మహాద్భుత దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. గత నాలుగు రోజులుగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకకుండాత్మక, నవాహ్నిక శ్రీ పాంచరాత్రగమశాస్త్ర రీతిలో సాగుతున్నాయి. శనివారం ప్రధానాలయంలో వేకువ జామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం తదితర పూజలను ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞీకులు, రుత్వికులు, పారాయణందారులు, అర్చకబృందం, నిత్యపూర్ణాహుతి చేపట్టారు.
అనంతరం ఉదయం 10.30 గంటలకు స్వామివారిని వటపత్ర శాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్రజప పఠనాలు గావించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారికి మంగళకరమైన వాయిద్యాలతో ప్రధానాలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. పశ్చిమ రాజగోపురం నుంచి తిరుమాడవీధుల్లోకి ప్రవేశించిన ఉత్తర సేవ, తూర్పు దక్షిణ తిరుమాడవీధుల్లోకి ఊరేగి తిరిగి పశ్చిమం గుండా ఆలయంలోకి ప్రవేశించడంతో భక్తులు స్వామివారి అలంకార సేవ చూసి తరించారు. అంతకుముందే స్వామివారిని తూర్పు మాడవీధుల్లో ప్రత్యేక వేంచేపు మండపంలో ఆస్థానం చేసి ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు వటపత్రశాయి విశిష్టతను భక్తులకు తెలిపారు.
హంస దివ్యవాహనంపై నారసింహుడు రాత్రి భక్తజనులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు నిత్యకైంకర్యాల అనంతరం నారసింహస్వామివారిని ప్రధానాలయంలోని కల్యాణ మండపంలో హంస వాహనంపై అదిష్టింపజేసి ప్రధానాలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఉప ప్రధానార్చకులు, సహయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి శ్రీకృష్ణాలంకరణసేవలో (మురళీకృష్ణుడు) భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం పొన్నవాహన సేవలో ఊరేగనున్నారు.