అల వైకుంఠాన్ని తలపించే పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణ వేడుకను కనులారా వీక్షించి భక్తజనం పరవశించింది. దేవదేవుడు నృసింహుడు పట్టువస్ర్తాలు, స్వర్ణ, వజ్రవైఢూర్యాలతో అలంకృతుడై గజ వాహనంపై తూర్పు మాఢవీధుల్లోని మండపానికి ఊరేగింపుగా రాగా, భక్తజనకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారు పూలపల్లకిలో చేరుకున్నారు. తుల లగ్న సుముహూర్తాన యాదగిరీశుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
– యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పు తిరుమాఢవీధుల్లోని బ్రహ్మోత్సవ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన దేవదేవుడి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఉదయం శ్రీరామ అలంకారంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు.
– యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28
యాదగిరిగుట్ట కొండ గుహలో వెలిసిన భక్తజనబాంధవుడు యాదగిరీశుడి శాంతి కల్యాణ మహోత్సవ పర్వాలు నేత్రపర్వంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి 8గంటలకు స్వయంభూ ప్రధానాలయ తూర్పు మాఢవీధుల్లో నెలకొల్పిన బ్రహ్మోత్సవ మండపంలో వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ తంతు ప్రారంభించారు. ముక్కోటి దేవతలు ఆహూతులుగా, బ్రహ్మాది దేవతల సమక్షంలో దేవదేవుడు యాదగిరి నృసింహుడు లోక కల్యాణార్థం సముద్ర తనయ మహాలక్ష్మి అమ్మవారి మెడలో రాత్రి 10:17 గంటలకు తుల లగ్న సుముహూర్త శుభ ఘడియల్లో మాంగళ్యధారణ చేశారు. పట్టువస్ర్తాలు, స్వర్ణ, వజ్ర వైఢూర్య, ముత్యాల ఆభరణాలతో నవ వరుడిగా అలంకృతుడైన నరసింహుడు గజ వాహనంపై మండపానికి ఊరేగింపుగా వచ్చారు. భక్తజనకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారిని పుష్పాల పల్లకీలో తూర్పు మాఢవీధుల్లో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలోని కల్యాణ వేదికకు తీసుకొచ్చారు.
భక్తజనుల జయజయ ధ్వానాలు, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, పారాయణందారులు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు చేరిన ఉత్సవమూర్తులను కల్యాణ మండపంపై అధిష్ఠింపజేశారు. పంచారాత్రగమశాస్త్ర రీతిలో దేవతల సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి తొలి పూజతో లక్ష్మీనరసింహుల కల్యాణ వేడుకకు శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్లకు రక్షాసూత్రధారణ చేసిన అర్చకులు వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణలతో స్వామివారికి యజ్ఞోపవీతధారణ తంతు నిర్వహించారు. దేవదేవుడు నరసింహుడికి లక్ష్మీ అమ్మవారి తండ్రి సముద్రుడు పాద ప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదాన తంతు నిర్వహించారు,. వధూవరులు నరసింహుడు, మహాలక్ష్మి శిరస్సులపై జీలకర్ర, బెల్లం అలంకరించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య మాంగళ్యధారణ సాగింది. కల్యాణ మహోత్సవాన్ని ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, డీఈఓను ఆదేశించారు. ఈ సెలవుకు బదులుగా మార్చి 11న రెండో శనివారం అన్ని విద్యాసంస్థలు పనిచేస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారిని శ్రీరాముడి అలంకరణలో తీర్చిదిద్ది హనుమంత వాహనంపై వేదమంత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. రామచంద్రుడి ప్రతాపం, శరణాగతత్రాణ పరాయణం, ఏకపత్నీవ్రత దీక్ష, ధర్మపాలన వంటి సకల గుణ సంపన్నుడైన రామచంద్రుడిని క్షేత్రపాలకుడైన హనుమంతుడి వాహనంపై అధిష్ఠించారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం వేద పండితుడు మురళీకృష్ణమాచార్యులు శ్రీరాముడి సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రీరామ అలంకరణలో స్వామివారిని దర్శించిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రధానార్చకుడు నల్లన్థీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన ఏర్పాటు చేసిన సాంస్కృతిక మండపంలో వైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతభేరి భక్తులను అలరించింది. ఉదయం భూదాన్ పోచంపల్లికి చెందిన పాండురంగస్వామి భజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన గాయత్రి మహిళా భజన మండలి వారి భజన, అనంతరం ఆస్థానం వారి మంగళ వాయిద్యం, వైదిక ప్రార్థనలు, బ్రహ్మశ్రీ మైలవరం శ్రీనివాసరావు నృసింహతత్వంపై చేసిన ఉపన్యాసం అద్భుతంగా కొనసాగింది. చేబ్రోలు నారాయణదాసు, భాగవతార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గంటల వరకు భీష్మప్రతిజ్ఞ హరికథా గానం కొనసాగింది. సాయంత్రం లలితా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యం, కుమారి జయప్రదా రామ్మూర్తి వారి వేణుగాన కచేరీ భక్తులను ఆకట్టుకున్నది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, కేసీఆర్ అక్కాచెల్లెళ్లు పాల్గొన్నారు. కల్యాణ మండపం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీవీఐపీ గ్యాలరీలో వారు కూర్చొని సుమారు 2గంటల పాటు జరిగిన వివాహ తంతును వీక్షించారు. విశ్వక్సేనారాధన మొదలుకొని మాంగళ్యధారణ వరకూ తిలకించి స్వామివారి ఆశీర్వచనం పొందారు. సీఎం కేసీఆర్ కుటుంబం తరఫున కల్వకుంట్ల శోభ స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు, పండ్లు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ తంతు ప్రారంభానికి ముందు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట సంకల్పం చెప్పారు. కేసీఆర్ గోత్రనామాలు, కుటుంబ సభ్యుల పేర్లు పఠిస్తూ సంకల్పం పఠించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి కుటుంబం గోత్రనామాల పేరిట సైతం సంకల్పం జరిపి కల్యాణ తంతును ప్రారంభించారు.
లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తికి, ఈఓ గీతకు పట్టువస్ర్తాలు అందజేశారు. మొదట యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్న మంత్రులు స్వయంభువులకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కల్యాణ మండపం వద్ద స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనితారామచంద్రన్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, డీసీపీ రాజేశ్ చంద్ర, ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి అదేవిధంగా తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ రమేశ్‌బాబు యాదగిరిగుట్ట ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీతకు స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేశారు.