యాదగిరిగుట్ట, మే 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో నృసింహుడి జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం ప్రధానాలయం ముఖ మండపంలో ఉదయం 9:30 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు. అనంతరం లక్ష్మీసూక్త, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, నవ కలశస్నపనం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి లక్ష కుంకుమార్చనను పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. ఉదయం 11:30 గంటలకు కాళీయమర్థనుడిగా స్వామివారిని అలంకరించి ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 6 గంటలకు నిత్య హవనాలు, సామూహిక పారాయణాలు, నృసింహ మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి తిరు మాఢవీధుల్లో ఊరేగించారు. హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవలో నారసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు శాస్త్రప్రకారం నిర్వహించారు. నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ భాస్కర్‌రావు, డీఈఓ దోర్బాల భాస్కర్‌శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ముఖ్య అర్చకుడు మంగళగిరి నర్సింహమూర్తి, ఆలయ ఏఈఓ జూశెట్టి కృష్ణ, గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రవణ్‌కుమార్, పర్యవేక్షకుడు సురేందర్‌రెడ్డి, అర్చక బృందం పాల్గొన్నారు.
నేటితో ఉత్సవాలు పరిపూర్ణం
లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం 7 గంటలకు మూలమస్త్ర హవనం, 9 నుంచి 9:30 వరకు మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టితో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.