యాదగిరిగుట్ట, జనవరి 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. అనంతరం లక్ష్మీనారసింహుల జోడు సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీవారికి పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చనలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామి వారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో సందడిగా మారింది. స్వామివారి కల్యాణోత్సవం, ఆర్జిత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.19,65,432 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.