యాదగిరిగుట్ట, జూలై 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
అనంతరం లక్ష్మీ సమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 8వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 15,31,145 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.