యాదాద్రి, జనవరి 11 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి తిరుప్పావై వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 9వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.12,17,281 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరీశుడి సేవలో ఐజేయూ ప్రతినిధి బృందం
యాదాద్రీశుడిని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీతో పాటు ఇతర ఐజేయూ బృందంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా పునర్నిర్మించిన ప్రధానాలయాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదగిరీశుడి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ కితాబునిచ్చారు. దేశ చరిత్రలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట క్షేత్రం మారనున్నదని అన్నారు.
తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత ఎంతో నచ్చిందన్నారు. ఐజేయూ 10వ ప్లీనరీ విజయవంతంగా ముగిసిందన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర జర్నలిస్టు నాయకులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, ఐజేయూ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల నారాయణ్ పంచాల్, కార్యదర్శి రాజమౌళి, కార్యవర్గ సభ్యులు భాస్కర్, నవీన్‌శర్మ, డాక్టర్ జోగిందర్ సింఘ్, సంజయ్ హింద్వాన్ బాబు థామస్, జర్నలిస్టు సంఘం నాయకులు యోగానంద్, గొట్టిపర్తి భాస్కర్‌గౌడ్, పున్న శ్రీకాంత్, జిల్లా జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.