యాదగిరిగుట్ట, ఆగస్టు 13: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పుర్వగిరి(పాతగుట్ట) ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరుగనున్నది. సాయంత్రం 6 గంటలకు స్వస్తీవాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణంతో ఉత్సవాలను ప్రధానార్చకుల బృందం ప్రారంభించనున్నది. మొదటి రోజు కంకణధారణ పూజ, మృత్స్యంగ్రహణం, పాలికాది హోమం నిర్వహించనున్నారు.
పవిత్రమైన శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవం అనే వైదృశ్య కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు తెలిపారు. చతుస్థానార్చన పూర్వకంగా స్వామివారిని బింభం, కుంభం, కుండం, మండలం యందు ఆవాహనం చేసి, ఆరాధిస్తూ ప్రత్యేకమైన అభిషేకాలను చేయనున్నట్లు పేర్కొన్నారు. మహానివేదనలు సమర్పించి పవిత్రమాలలను ధరింపజేయనున్నట్లు చెప్పారు.
ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపానికి ఎదురుగా రెండ్రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. విమానగోపురంపై మహా సుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేసేందుకు తాత్కాలిక పరంజాలను ఏర్పాటు చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా 15, 16 తేదీల్లో భక్తుల ద్వారా జరిపే నిత్య, శాశ్వత తిరుకల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం రద్దు చేస్తున్నట్లు ఈఓ భాస్కర్రావు వెల్లడించారు.