యాదగిరిగుట్ట, జూన్14: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పొటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. కొండకింద కల్యాణకట్ట తలనీలాలు, లక్ష్మీ పుష్కరిణి, బస్టాండ్, వ్రత మండప ప్రాంతాల్లో భక్తుల కోలాహలం నెలకొన్నది. లక్ష్మీపుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తుల పోటీ పడ్డారు. దీంతో పుష్కరిణి భక్తులతో కిక్కిరిసింది. కొండ కింద పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది.
ప్రసాద విక్రయశాలలో ప్రసాద కొనుగోళ్లతో భక్తుల పోటీపడ్డారు బస్టాండ్ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. స్వామివారి ధర్మ దర్శానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం 7 గంటలవరకు లక్షా 15వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు.
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణ మూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవోత్సవం జరిగింది. దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 71,70,982 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్ తెలిపారు.