యాదగిరిగుట్ట, ఫిబ్రవరి12 : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 42 వేల మంది భక్తులు రాగా స్వామివారి ఖజానాకు రూ.48,81,724 ఆదాయం సమకూరింది.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారిని సుమారు 42వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. దీంతో అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.48,81,724 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన భావనాలయ నృత్యం, సంగీతం సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మెట్ల నృత్యోత్సవం ఘనంగా నిర్వహించారు. భావనాలయ నాట్యాచార్యులు వట్టికోట యాదగిరాచార్యులు 34మంది శిష్యులతో కొండ వైకుంఠ ద్వారం నుంచి మెట్ల గుండా నృత్యం చేశారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అన్నమయ్య రచించిన నవనారసింహ కీర్తనలతో తెలుగు సంప్రదాయ నృత్యాలను వేసుకుంటూ యాదగిరి కొండపైకి చేరుకున్నారు. అనంతరం స్వామివారి తూర్పు రాజగోపురం ఎదురుగా చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వట్టికోట యాదగిరాచార్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 108 ఆలయాలు తిరిగి నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నారసింహుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి వద్ద నృత్యం చేసుకుంటూ వచ్చి దర్శించుకున్నామన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ర్టాల్లోని 17 ఆలయాలను తిరిగామన్నారు.
యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగు, పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామి వారిని అభిషేకించారు. వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుము పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో స్వయంభువుడికి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు చేశారు.
ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్టు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ పట్టణంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ తంతును ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10.05గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సుమారు 2గంటల పాటు సాగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, కన్యావననం, స్వామివారి పాదప్రక్షాళన, నూతన వస్త్ర సమర్పణ, మహా సంకల్పం, చూర్ణిక, లగ్నాష్టకం, కన్యాదానం, మాంగళ్యసూత్రధారణ, బ్రహ్మముడి, అక్షతరోపణ వంటి వైదృష్య కార్యక్రమాలు మంగళ నిరాజన మంత్ర పుష్పాలతో కల్యాణ కైంకర్యానికి ముగింపు పలికారు. కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, ఆలయాధికారులు సురేందర్‌రెడ్డి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయాధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి సమీపిస్తుండటంతో భక్తులకు ఇబ్బంది కలుగకుండా శివాలయ తిరు మాఢవీధులు పూర్తిగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కల్యాణ మండపం, యాగశాల, ప్రధానాలయాన్ని శివరాత్రి వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 6,61,800
వీఐపీ దర్శనాలు 3,97,500
బ్రేక్ దర్శనం 3,99,300
వేద ఆశీర్వచనం 26,400
నిత్య కైంకర్యాలు 4,600
సుప్రభాతం 9,900
ప్రచార శాఖ 20,500
వ్రత పూజలు 2,04,800
కల్యాణకట్ట టికెట్లు 1,47,500
ప్రసాద విక్రయం 19,07,450
వాహన పూజలు 19,400
అన్నదాన విరాళం 52,652
శాశ్వత పూజలు 30,000
సువర్ణ పుష్పార్చన 1,43,380
యాదారుషి నిలయం 1,54,082
పాతగుట్ట నుంచి 80,460
కొండపైకి వాహన ప్రవేశం 6,00,000
శివాలయం 10,300
పుష్కరిణి 1 ,200
ఇతర విభాగాలు 10,500