రామన్నపేట, జులై 04 : అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగారం గ్రామానికి చెందిన బద్దుల రాజు (34) గ్రామ శివారులో గల ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పంట పెట్టుబడికి, బోరు మోటారు కోసం గ్రామంలో గత సంవత్సరం రెండు లక్షల వరకు అప్పు చేశాడు.
పంట సరిగ్గా రాకపోవడంతో అప్పులు తీర్చలేకపోయాడు. చేసిన అప్పులు అలాగే పెరిగిపోతుండడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం 9 గంటలకు గడ్డి మందు తాగాడు. ఇంటి పక్కన ఉన్న మహిళ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం రామన్నపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మధ్యాహ్న సమయంలో మృతి చెందాడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు ఎస్ఐ మల్లయ్య కేసు నమోదు చేశారు.