యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట(పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం స్వామివారి నిత్య ఆరాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం, సాయంత్రం పరమపద ఉత్సవం పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బజాభజంత్రీలతో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్త్రోక్తంగా పాశురాలను పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీత, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చకులు సంపతాచార్యులు, ఏఈవోలు భాస్కర్, శంకర్, జూనియర్ అసిస్టెంట్లు నర్సింహ, సింహచారి, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పరమ పదోత్సవ విశిష్టత..
భగవానుడి నిత్య నివాసస్థానమైన శ్రీవైకుంఠానికి పరమపదం అనే విలక్షణమైన నిత్యసివాస్థానం. పరమాత్మది మాయాతీతం అనగా కేవలం శుద్ధ, సత్య ప్రకాశం నిత్యముక్తుల చేత సంసేవ్యమానం అని శ్రీ, భూ, నీళాది దివ్యపత్ని సమేతుడై దక్షిణముఖంగా అనంత శయనాసీనుడై మణిమయ సహస్ర స్తంభ శోభితమైన భగవంతుని యొక్క దివ్యదర్శనమే పరమపదనాథుడి దర్శనం.
భగావత్ రామానుజులు పరమపదనాథుడిని ప్రస్తుతిస్తూ ప్రేమాతిశయం కలిగిన జగత్ కారక తత్వమే ఈ స్వరూపం అని పలు విధాలుగా స్తుతించారు. భగవద్ అనుగ్రహం మోక్షం పొందిన వారికి మాత్రమే దర్శనభాగ్యం కలిగించు ఈ పరమపదనాథుడి ఆళ్వారాదుల ప్రబంధాలలో భక్తకోటికి నయనానందం కలిగిస్తుంది. తత్తంగా దర్శన భాగ్యంను కలిగిస్తుంది. పరమ పదనాధుడి ముక్తి ప్రదం అని ద్యి ప్రబంధ సారాంశం.
నేటితో అధ్యయనోత్సవాలు ముగింపు..
గత మూడురోజులుగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలకు నేడు ముగింపు పలుకుతారు. నాలుగో రోజు అధ్యయనోత్సవంలో భాగంగా గురువారం ఉదయం నూత్తందారి చాత్మరా ఉత్సవంతో ఉత్సవాలకు పరిసమాప్తం పలుకనున్నారు.
యాదాద్రిలో నిత్యకల్యాణోత్సవం..
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలలో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. లక్ష్మీ నర్సింహలను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన హోమం, లక్ష్మీ నర్సింల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు.
మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. అన్ని విభాగాలను కలుపుకుని శ్రీవారి ఖాజానాకు రూ. 6,41,708 సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.