
యాదాద్రి: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను వినియోగించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. కరోనా కట్టడి చేయడంతో పాటు కాలుష్యం బారిన పడుకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని 11వ వార్డులో జిల్లా వాసవి క్లబ్, శ్రీశాంకరి డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలువురికి మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితిని కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవడంతో పాటు కాలుష్యరహిత మట్టి ప్రతిమలతో సమాజానికి సందేశాన్నివ్వాలని కోరారు. కాలుష్య కారకమైన రంగులను వాడి తయా రు చేసే గణపతి ప్రతిమలను వాడటంతో అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. వేల కోట్ల ప్రభుత్వ నిధులు వెచ్చించి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

ఆలయ అభివృద్ధితో యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందుతుందన్నారు. ఈ సందర్భంగా గుట్ట ప్రాంతవాసులు అదృష్టవంతులుగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేం దర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు, శ్రీశాంకరి డెవలపర్స్ ప్రతినిధులు శ్రీరాంమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.