యాదాద్రి, ఫిబ్రవరి 13 : యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణం, నిశ్చయ తాంబూలాలకు ఒప్పందం కుదిర్చారు. సోమవారం రాత్రి 8గంటలకు కల్యాణ సుముహూర్త ఘడియలుగా నిర్ణయించారు. నారసింహుడి వరపూజ, వధువు లక్ష్మీదేవికి పూలు, పండ్ల కార్యక్రమం కనుల పండువగా అర్చకులు నిర్వహించారు. ఎదుర్కోలు మహోత్సవాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. అర్చకులు శ్రీవారు, అమ్మవారు గుణగణాలను వర్ణించారు. జీవకోటిని ఉద్ధరించేందుకు శ్రీవారు అశ్వవాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
పెళ్లి కుమారుడిగా నారసింహుడు
పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీనరసింహుడు పెళ్లి కుమారుడయ్యాడు. రాత్రి ఎదుర్కోలు కోసం ముందస్తుగా పెళ్లి కుమారుడిని చేసి సోమవారం జరిగే తిరుకల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధం చేశారు. పెళ్లి కొడుకైన శ్రీవారిని సింహవాహన అలంకార సేవలో భక్తుల సందర్శనార్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఉదయం హవన ఉత్సవం జరిపారు. పురప్పాట్ సేవల్లో భాగంగా శ్రీవారిని సింహవాహన సేవలో ఊరేగించారు. సింహవాహన విశిష్టతను ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు వివరించారు.
ఎదుర్కోలు విశిష్టత..
పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు విశిష్ణమైనది. అమ్మవారు, స్వామి వారిని కల్యాణమూర్తులుగా అలంకరించి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆస్థాన మండపంలో ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించడం వల్ల భక్తజనం ఎంతో ఆనందిస్తుంది. ఎదుర్కోలు వేడుకలో అమ్మవారిని జీవకోటి ప్రతినిధిగా, స్వామివారిని పరమాత్మ ప్రతినిధిగా భావిస్తారు. భగవానుడిని జీవుడు చేరడం చాలా కష్టం కాబట్టి అమ్మవారి ద్వారా శ్రీవారిని చేరడం సులభమని ఆళ్వార్లు, ఆచార్య పురుషులు అమ్మవారి వైభవాన్ని స్తుతించారు. కల్యాణ మహోత్సవం నిర్వహణతో జీవకోటిని, ప్రకృతిని ఆనందింపజేయడానికి భగవంతుడి అనుగ్రహంగా పెద్దలు ఈ వేడుకలను నిర్వహిస్తారని ప్రధానార్చకులు తెలిపారు.
సింహ వాహన ప్రత్యేకత..
దశావతారాల్లో స్వామి సగం నరుడిగా సగం సింహంగా రూపాన్ని మార్చుకొని అవతరించిన అవతారమే నరసింహ అవతారం. ఒకటా, రెండా, ఎన్నెన్ని గుణాల్లో సింహ రూపంలో శతృభీతి, భక్తజన ప్రీతి, ఆశిత్ర రక్షణ, త్పరత, ఒకే చోట నిలువరించిన రూపమే నారసింహ రూ పం. వేడుకల్లో ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఏఈఓలు దోర్భల భాస్కర్శర్మ, భక్తులు పాల్గొన్నారు.
సంప్రదాయ రీతిలో నిశ్చయ తాంబూలం
రాత్రి 8గంటల సమయంలో పట్టు వస్ర్తాల అలంకరణలతో అశ్వవాహన సేవపై నారసింహుడు, ముత్యాల పల్లకీపై లక్ష్మీదేవిని ఆలయం నుంచి ఊరేగింపుగా మేళతాళాల నడుమ ప్రధాన మండపానికి చేర్చారు. ఎదురెదురుగా స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి శ్రీవారి వైపు ఆలయ ఈఓ ఎన్.గీత, అమ్మవారి వైపు ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ప్రధానార్చకులు మోహనాచార్యులు, అర్చక బృందం వైష్ణవ సంప్రదాయ రీతిలో సంబంధం ఖాయమైన ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు, వేదపండితులు, యాజ్ఞీకులు కలిసి కల్యాణ ఒప్పందాన్ని కుదిర్చారు.
నేడు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం..
పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన తిరుకల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం హనుమంత సేవలో ఊరేగే నరసింహుడు రాత్రి గజవాహనంలో ఊరేగుతూ కల్యాణ మహోత్సవానికి తరలివస్తారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.