యాదాద్రి, ఫిబ్రవరి 7 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా ఉన్న పాతగుట్టలో నాలుగు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాలకు అర్చకులు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రత్యేక సేవపై స్వామి అమ్మవార్లతో పాటు, ఆళ్వార్ స్వాములను అలంకరించారు. ఆలయంలో నిత్యారాధనల అనంతరం తిరుమంజన మహోత్సవాన్ని పాంచరాత్రగమ సాంప్రదాయ రీతిలో ప్రధానార్చకులు, అర్చకులు, పారాణికులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తొళక్కంతో ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయ మండపంలో సేవకు అర్చకులు, పారాయణికులు, రుత్వికులు వేద పారాయణాలు ఆలపించారు. మంగళవారం ఉదయం తిరుమంజనం నిర్వహించిన అనంతరం సాయంత్రం దివ్యప్రబంధంతో పాటు పురపాట్ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అధ్యయనోత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.