భువనగిరి అర్బన్, జనవరి 24 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలోని లింగబస్వ గార్డెన్లో గొర్రెల, మేకల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌కు సోమవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలరాజుకు ఇచ్చిన పదవి ఆయనకు కాదని యాదవ కులానికే దక్కిందన్నారు. 75ఏండ్ల నుంచి పట్టించుకోని యాదవ కులానికి తెలంగాణ రాష్ట్రం వచ్చాకే గుర్తింపు వచ్చిందన్నారు. యాదవ కులానికి ఎంపీ, ఎమ్మెల్సీ పదవితో పాటు కుల అభివృద్ధికి బాలరాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టడంతో పార్టీ అభివృద్ధికి తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యాదాద్రి అభివృద్ధి, కాళేశ్వరంతో 2.50లక్షల ఎకరాలు సాగులోకి వస్తే బీజేపీ ప్రభుత్వానికి కన్పిస్తలేదన్నారు.
పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా గుర్తింపు : ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ నమ్ముకుని, పార్టీ వెన్నంటి ఉండేవారికి ఎప్పటికైనా గుర్తింపుతో పాటు పదవులు దక్కుతాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందన్నారు. తెలంగాణ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయన్నారు.
తెలంగాణనే నా నినాదం : బాలరాజుయాదవ్
ఉద్యమ సమయంలో తెలంగాణనే తన నినాదంగా పనిచేశానని, ఆ కష్టానికి ఫలితంగానే న్యాయం జరిగిందని దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ తనను గుర్తించి ఇచ్చిన పదవి తనది కాదని, తన కులానికి చెందుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. అనంతరం ఎంపీ బడుగుల లింగయ్య, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బాలరాజుయాదవ్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, గొల్ల కురుమల సంఘం జిల్లా కన్వీనర్ అయోధ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, జిల్లా గొల్లకురుమ సంఘం సభ్యులు వీరేశ్‌యాదవ్, కంకల కిష్టయ్య, నాయకులు పాల్గొన్నారు.